Saturday, May 4, 2024

విద్యుత్ వినియోగాన్ని దుర్వినియోగం చేయొద్దు – టీఎస్ఈఆర్సీ చైర్మన్

తాండూరు : విద్యుత్ వినియోగ సేవ‌ల్లో అధికారులు, వినియోగ‌దారులు దుర్వినియోగానికి పాల్ప‌డ‌రాద‌ని తెలంగాణ‌ విద్యుత్ నియంత్రణ మండలి (తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్-టీఎస్ ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని శ్రీ దుర్గ గ్రాండ్యూర్లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశానికి హాజరైన చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యుత్ రంగం మెరుగుపడిందన్నారు. రాష్ట్రంలోని రైతులకు, వ్యాపారులకు, పేద ప్రజలకు కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.35 వేల కోట్లను వెచ్చిస్తుందన్నారు. వ్యవసాయ రంగానికి రూ.5వేల కోట్లు వెచ్చిస్తుందని వెల్లడించారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు, రజకులకు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ అందిస్తుందన్నారు. ఫౌల్ట్రీ, చేనేత రంగాలతో పాటు బలహీనవర్గాల కు విద్యుత్ సరఫరా రాయితీ కల్పిస్తుందని గుర్తు చేశారు. రైతులు, లబ్దిదారులు, వినియోగ దారులు విద్యుత్ సరఫరాను దుర్వినియోగం చేయరాదని సూచించారు. అంతకుముందు విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా వినియోగదారులకు ఉన్న హక్కులతో పాటు బాధ్యతలపై అవగాహన కల్పించారు. అనంతరం నుండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖిలో చైర్మన్ శ్రీరంగారావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ వినియోగదారులు సంస్థకు భగవంతునితో సమానమన్నారు. వారి సమస్యలను నిర్దిష్ట సమయానికి పరిష్కరించాలని ఆదేశించారు. మరోవైపు వినియోగారులు సమస్యలను పరిష్కరించకపోతే విద్యుత్ నియంత్రణ మండలి ఫోన్: 040233117127 – 28లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు ఎండి మనోహర్ రావు, బండారు కృష్ణయ్య, డైరెక్టర్, ఎస్ఈ, డీఈ, ఏఈ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement