Monday, November 11, 2024

ఇండ్లు అడిగితే అరెస్టులా..?.. షాద్ నగర్ లో బిజెపి నాయకులు అరెస్ట్

షాద్ నగర్, ప్రభన్యూస్, జూలై 20 : తెలంగాణలో రజాకార్ల పాలన తలపించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అక్రమ నిర్బంధాలతో అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య షాద్ న‌గర్ నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ విజయకుమార్ పాలమూరు విశ్వవర్ధన్ రెడ్డి రాష్ట్ర యువ నాయకుడు ఏపీ మిథున్ రెడ్డి చెట్ల వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన నేపథ్యంలో బిజెపి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ‌ అరెస్టులు చేస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఏపీ మిథున్ రెడ్డి స్వగృహంలో పోలీసులు ప్రవేశించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన నాయకులు ఏపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమ నిర్బంధాలను చేపట్టిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఇల్లు పంపిణీ చేయడం చేతకాదని ఆరోపించారు. గతంలో అనేక సార్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో అల్టిమేటం జారీ చేసినా నిమ్మకు నీరెత్తినట్లు పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఏ నియోజకవర్గంలో పేదలకు ఒక ఇల్లు కూడా ఇవ్వకపోవడం విచారకరమన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో బిజెపి దళాలు ప్రజాక్షేత్రంలోకి కదిలితే ఇప్పుడు పోలీసులను పెట్టి తమ పర్యటనలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయకపోతే ప్రభుత్వానికి ఎందుకు భయం వేస్తుందని, తమ హక్కులను ప్రశ్నించే కనీస హక్కు లేదా ? అని నిలదీశారు. పోలీసులతో బలవంతంగా అరెస్టులు చేయించినంతమాత్రాన తమ ఉద్యమం ఆగదని డబుల్ బెడ్ రూమ్ అక్రమాలను వెలికి తీసి ప్రజలకు నివేదిస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement