Saturday, May 4, 2024

Press Meet – గతంలో ఏమి జరిగిందో మర్చిపోదాం, కలిసి పనిచేద్దాం రండి : బిఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి పిలుపు

‘‘తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి విజయం అందించారు. ఈ విజయాన్ని తెలంగాణా కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు అంకితం ఇస్తున్నాం” అని టీపీసీసీ అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధికత్యంతో దూసుకు పోతున్న తరుణంలో.. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజల హక్కులను కాపాడుతూ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పని చేస్తుందన్నారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాలన అందించిందో.. అదే స్థాయిలో ప్రజాపాలన అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇది ప్రజలు ఇచ్చిన విలక్షణ తీర్పు, పాలక వర్గాన్ని, ప్రతిపక్షాన్ని ప్రజలు ఆదేశించారని, ఈ తీర్పునకు శిరసావహించాలని బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి కోరారు.

గతంలో ఏమి జరిగిందో మర్చిపోదాం, ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసే ఘటనలు జరిగాయి, ఇలాంటి ఘటనలకు తావులేకుండా ప్రభుత్వానికి సహకరించాలని బీఆర్ఎస్ను రేవంత్ రెడ్డి కోరారు. ఇక సచివాలయం పేరును డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్ అవుతుంది, ప్రగతి భవన్ కాదు, ప్రజాభవన్ గా మారుతుంది, సచివాలయంలోకి ప్రవేశానికి ఎలాంటి అనుమతులకు అవకాశం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తాం, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను చట్టబద్దం చేస్తాం అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్కు థ్యాంక్స్

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై స్పందించిన కేటీఆర్… తన ట్వీట్లో కాంగ్రెస్ పార్టీని అభినందించారు. ఇందుకు స్పందించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ అభినందనలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రభుత్వ నిర్వహణలోనూ ఇదే స్ఫూర్తి కనపర్చాలని, చిల్లర తగాదాలు లేకుండా ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని, ప్రభుత్వాన్ని సజావుగా నిర్వహించటానికి సూచనలు ఇవ్వటం ప్రతిపక్షం బాధ్యత అన్నారు. అందుకే ప్రతి పక్షం బాధ్యతగా వ్యవహిరించాలని రేవంత్ రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement