Monday, May 6, 2024

పోడు సాగు వంకతో భూములపై హక్కులు పొందే ప్లాన్..

ప్ర‌బ‌న్యూస్ : రాష్ట్రంలో పోడు భూములపై హక్కులు కల్పించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతోనే అక్రమార్కులు రంగంలోకి దిగి అటవీ భూములను చదును చేస్తున్న ఘటనలు ఒకొక్కటిగా బయట పడుతున్నాయి. పోడు భూముల సాగు వంకతో అక్రమంగా అటవీ భూములపై హక్కులు పొందేందుకు కొందరు పన్నాగాలు పన్నుతున్నారు. పలు జిల్లాల్లో పోడు పట్టాలను పొందాలనే దురుద్దేశంతో రాత్రికి రాత్రే అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూములను గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లతో చదును చేస్తున్నారు. అక్రమణలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న అటవీ శాఖ సిబ్బందిపై అక్రమార్కులు ఎదురు దాడులకు దిగుతున్నారు. దీంతో నిఘా పెంచి, అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. కొంతమంది గిరిజనేతరులు అటవీ భూములను ఆక్రమించి చెట్లను నరికి చిన్న చిన్న ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారని అటవీశాఖ అధికారి ఒకరు చెప్పారు.

రెండు రోజుల క్రితం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ సమీప అటవీ ప్రాంతంలో అటవీ భూముల్లోని గుడిసెలను తొలగించిన ఘటనలో అక్రమదారుల నుంచి అటవీ అధికారులకు ప్రతిఘటన ఎదురైంది. అలాగే కామారెడ్డి జిల్లా మంబోజిపేట-కొండాపూర్‌ తండా సమీపంలో అటవీ భూములను చదును చేస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో అటవీ అధికారులపై అక్రమార్కులు దాడులకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో పోడు సాగు జరుగుతుండగా, అందులో పదకొండు జిల్లాల్లో మాత్రమే పోడు భూములు అధికంగా ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్‌ 31ను కటాఫ్‌ తేదీగా తీసుకుని అర్హులైన పోడు రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 2005 కంటే ముందు ఉన్న పోడు సాగుదారులకు హక్కులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, 2005 తర్వాతే లక్షలకు పైగా అటవీ భూమి అన్యాక్రాంతం అయినట్లు గుర్తించినట్లు అటవీ శాఖ అధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి 2005కు ముందు నుంచి ఉన్న గిరిజనులకు, కనీసం 75 ఏళ్ళ పాటు పోడు సాగులో ఉన్న గిరిజనేతరులకు మాత్రమే హక్కులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement