Sunday, April 28, 2024

మద్యం అక్రమ సరఫరాదారులపై పిడి యాక్ట్‌ .. కట్టడికి విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా రాష్ట్రానికి దిగుమతి అవుతున్న అక్రమ మద్యం నివారణకు అధికారులు ఉక్కు పాదం మోపాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. గురువారంనాడు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమానాశ్రయం, రైల్వే, బస్సుల ద్వారా, ఇతర రవాణా మార్గాల ద్వారా రాష్ట్రానికి వచ్చే అక్రమ మద్యం అరికట్టడానికి పూర్తిస్థాయిలో విస్తృత తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ మద్యం రవాణాపై రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ అధికారులు రైల్వే, బస్‌ స్టేషన్‌, అంతర్‌ రాష్ట్ర బస్సు రవాణా ఆపరేటర్లకు తెలిసేలా నోటీసులనిచ్చి, వారికి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనీ అదేశించారు.

తెలంగాణ ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ చట్టం-1968 ప్రకారం అనుమతి లేకుండా రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల మద్యం ఎంత చిన్న పరిమాణం లోనైనా తీసుకురావడం శిక్షారమైన నేరమని తెలిపారు. సెక్షన్‌ 34 (1) ప్రకారం ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి రూ. లక్ష జరిమానాతోపాటు, ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ప్రజల్లో ఈ మేరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అక్రమ మద్యం ఇతర రాష్ట్రాల నుండి తరలించే వ్యక్తులపై విధించే శిక్షను ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల జైలు శిక్షను ఏడేళ్లకు పెంచేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.

- Advertisement -


రాష్ట్రంలో ఉన్న ఫంక్షన్‌ హాల్స్‌ యజమానులు, ఈవెంట్‌ నిర్వాహకులు, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్వాహకులు, బ్యాంకెట్‌ హాల్‌ నిర్వాహకులు, హోటల్‌ నిర్వాహకులకు అక్రమ మద్యంపై సరఫరాపై అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించకుండా అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అక్రమ మద్యం సరఫరాపై పోలీస్‌, రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల సహకారం, సమన్వయంతో గుడుంబా తయారీ, బెల్లం సరఫరాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

డిఫెన్స్‌ క్యాంటీన్లలోని మద్యాన్ని బయటి వ్యక్తులకు అమ్మటంపై నీఘా పెట్టి తగు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతర్‌ రాష్ట్ర రవాణా సర్వీసులైన కార్గో, పార్సల్‌ సర్వీసులు నిర్వహిస్తున్న వారికి ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం సరఫరా కాకుండా నోటీసులు ఇవ్వాలని అదేశించారు. అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారి వివరాలను ఎక్సైజ్‌ శాఖ అధికారులకు అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచాలని ఆదేశించారు. సమర్థవంతంగా పనిచేసే ప్రోహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఇంక్రిమెంట్లు, యాక్షిల్లరి ప్రమోషన్లతోపాటు పదోన్నతులు, పోస్టింగ్‌లలో ప్రయారిటీని అందిస్తామన్నారు. అదేవిధంగా నేరాలను ప్రోత్సహించే వారిని గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ అజయ్‌ రావు, జాయింట్‌ కమిషనర్లు ఖురేషి, శాస్త్రి, సహాయ కమిషనర్లు చంద్రయ్య గౌడ్‌ ,శ్రీనివాస్‌, ఈఎస్‌లు ఏ. సత్యనారాయణ, రవీందర్‌ రావు, అరుణ్‌ కుమార్‌, విజయభాస్కర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement