Saturday, May 11, 2024

క్రమబద్ధీకరణకు నోచుకోని పార్ట్ టైం లెక్చరర్లు..

  • 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న అధ్యాపకులు
  • కరువైన కనీస వేతనం.. ఆరు నెలలుగా అందని వేతనాలు
  • భారంగా మారిన కుటుంబ పోషణ
  • తర్వాత విధుల్లో చేరిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు క్రమబద్ధీకరణ
  • తమ సేవలను గుర్తించాలని వినతి
  • నేటి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని విన్నపం

బిక్కనూర్, మే 17 (ప్రభ‌ న్యూస్) : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒకేషనల్ పార్ట్ టైం అధ్యాపకులు క్రమబద్ధీకరణకు నోచుకోలేకుండా పోయారు. 30 సంవత్సరాలుగా కళాశాలలో పనిచేస్తున్న కనీస గుర్తింపు లేకపోవడంతో వారు మనోవేదన చెందుతున్నారు. వీరి తరువాత విధుల్లో చేరిన కాంట్రాక్ట్ లెక్చరులను ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకులుగా క్రమబద్ధీకరించారు. 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమ సేవలను గుర్తించి క్రమబద్ధీకరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 1993 సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల స్థానంలో ప్రభుత్వం పార్ట్ టైం లెక్చరర్లుగా నియమించింది. 1993 కంటే ముందు విధుల్లో చేరిన పార్ట్ టైం లేచారాలందర్నీ మినిమం టైం స్కేల్ కల్పిస్తూ రెగ్యులర్ లెక్చరర్లుగా నియమించారు. ఆ తరువాత పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం గుర్తించకపోవడంతో వారు మనోవేదన చెందుతున్నారు. రెండువేల విద్యా సంవత్సరంలో కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వం నియమించింది. వారి సంఖ్య ఎక్కువ ఉండడంతో ప్రభుత్వం వారికి దశల వారీగా వేతనాలు పెంచుతూ ఇటీవల వారి సర్వీస్ ను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వారి కంటే ముందు పని చేస్తున్న 53 మంది పార్ట్ టైం ఒకేషనల్ లెక్చరర్ల విషయంలో అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనీస వేతనంతో పాటు క్రమబద్ధీకరణకు నోచుకోలేక పోతున్నారు.

గత 30 సంవత్సరాలుగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న వారి సేవల పట్ల చిన్నచూపు చూడడంతో మానసికంగా కృంగిపోతున్నారు. ప్రస్తుతం పార్ట్ టైం లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి పిరియడ్ చొప్పున నెలకు 28400 చెల్లిస్తున్నారు. ఇవి కూడా గత డిసెంబర్ నుండి వారికి చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది. 1989 సంవత్సరంలో ఒకేషనల్ కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది అప్పట్లో పాఠాలు బోధించేందుకు రెగ్యులర్ లెక్చరర్లు లేకపోవడంతో పార్ట్ టైం ప్రతిపాదికన 1999 వరకు నియమిస్తూ వచ్చారు. ఆ తరువాత కాంట్రాక్టు వ్యవస్థను తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు వేలకు పైగా కాంట్రాక్టు అధ్యాపకులు, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నారు. 2013 తర్వాత గెస్ట్ లెక్చరర్ లను ప్రభుత్వం నియమించింది. వీరందరి కంటే ముందు పార్ట్ టైం లెక్చరర్లు విధుల్లో ఉన్నారు. 1993 కంటే ముందు విధుల్లో చేరిన పార్ట్ టైం లెక్చర్ల అందరినీ దశలవారీగా క్రమబద్ధీకరించారు. ప్రస్తుతం 53 మంది పార్ట్ టైం లెక్చరర్లు మిగిలిపోయారు. ప్రస్తుతం వీరందరి వయసు 50 సంవత్సరాలకు పైబడి ఉన్నవారు విధుల్లో పనిచేస్తున్నారు. వారి సేవలను ప్రభుత్వం గుర్తించి క్రమబద్ధకరించాలని కోరుతున్నారు. క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని తక్షణమే వారికి తగిన న్యాయం చేయాలని బాధిత పార్ట్ టైం లెక్చరర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement