Saturday, May 4, 2024

కాసులు కురిపిస్తున్న ర‌వాణ శాఖ – ఖ‌జ‌నాకు అక్సిజెన్..

ఉమ్మడి రంగారెడ్డి, ప్రభన్యూస్‌ బ్యూరో: రవాణా శాఖకు దండిగా ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండే సమకూరుతోంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో నంబర్‌వన్‌ స్థానంలో నిలుస్తోంది. వెయ్యి కోట్ల ఆదాయం సమకూర్చుకుంటేనే గొప్పగా చెప్పుకునే పరిస్థితులు… కానీ ఈసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకంగా రూ.2790.04 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఆదాయ సేకరణలో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా నంబర్‌వన్‌ స్థానంలో నిలవగా హైదరాబాద్‌కు ఉన్నతాధికారులతో శభాష్‌ అనిపించుకుంటున్నారు.

చాలా సంవత్సరాలుగా రవాణాశాఖకు అధిక ఆదాయం ఉమ్మడి జిల్లా నుండే సమకూరుతోంది. ఏ సంవత్సరమైనా కూడా ముందు వరుసలో నిలుస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఉమ్మడి జిల్లా నుండి ఆశించిన మేర ఆదాయం సమకూరింది. కరోనా నేపథ్యంలో పన్నులు రద్దు చేసినా అప్పట్లో ఆశించిన మేర ఆదాయాన్ని రవాణా శాఖ అధికారులు సమకూర్చుకున్నారు. హైదరాబాద్‌ మహానగరం చుట్టూరా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు, పిల్లల చదువుల కోసం వచ్చి ఉంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రియల్‌ వ్యాపారం కూడా దండిగా సాగుతుండటంతో వాహనాల కొనుగోళ్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పూర్తిగా గ్రామీణ ప్రాంతంగా పేరున్న వికారాబాద్‌ జిల్లాలో కూడా వంద శాతానికి పైగానే ఆదాయాన్ని సమకూర్చుకున్నారు.

ఉమ్మడి జిల్లా నుండి రూ.2790.04 కోట్ల ఆదాయం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి రవాణాశాఖ ద్వారా ఏకంగా రూ.2790.04 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన టార్గెట్‌కు రెట్టింపుగా ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. రంగారెడ్జి జిల్లాకు రూ.1206.66 కోట్ల మేర టార్గెట్‌ ఇవ్వగా రూ.1523.66 కోట్ల మేర ఆదాయం వచ్చింది. 126.3 శాతం మేర ఆదాయాన్ని సమకూర్చుకుని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. త్రైమాసిక పన్నుల ద్వారా రూ.127.36 కోట్లు, లైఫ్‌ ట్యాక్స్‌ ద్వారా రూ.1243.05 కోట్లు, ఫీజుల ద్వారా రూ.107.85 కోట్లు, డిటెక్షన్‌ ద్వారా రూ.25.4 కోట్లు, సర్వీస్‌ ఫీజుల నుండి రూ.20 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.979.76 కోట్ల మేర టార్గెట్‌ ఇవ్వగా ఇందులో రూ.1188.01 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకున్నారు. త్రైమాసిక పన్నలు నుండి రూ.111.36 కోట్లు, లైఫ్‌ టాక్స్‌ ద్వారా రూ.939.13 కోట్లు, ఫీజుల ద్వారా రూ.95.37 కోట్లు, డిటెక్షన్‌ ద్వారా రూ.22.04 కోట్లు, సర్వీస్‌ ఫీజుల ద్వారా రూ.19.75 కోట్ల మేర ఆదాయం సమకూరింది. పూర్తిగా వెనకబడి ఉన్న వికారాబాద్‌ జిల్లా నుండి కూడా ఆశించిన మేర ఆదాయం సమకూరింది. ఇక్కడ 2022-23 సంవత్సరానికి రూ.67.84 కోట్ల మేర టార్గెట్‌ ఇవ్వగా రూ.78.37 కోట్లు సమకూర్చుకున్నారు. త్రైమాసిక పన్నుల ద్వారా రూ.12.21 కోట్లు, లైఫ్‌ ట్యాక్సుల ద్వారా రూ.50.14 కోట్లు, ఫీజుల నుండి రూ.10.09 కోట్లు, డిటెక్షన్‌ ద్వారా రూ.3.76 కోట్లు, సర్వీస్‌ ఫీజుల ద్వారా రూ.2.17 కోట్ల మేర ఆదాయం వచ్చింది.

- Advertisement -

సగానికి పైగా ఆదాయం లైఫ్‌ ట్యాక్సుల ద్వారానే..
ప్రతి సంవత్సరం లైఫ్‌ ట్యాక్సుల ద్వారానే రవాణా శాఖకు ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. ఈసారి సగానికి పైగా ఆదాయం లైఫ్‌ ద్వారానే సమకూరింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2254.26 కోట్ల మేర టార్గెట్‌ ఇవ్వగా ఇందులో రూ.2790.04 కోట్ల మేర ఆదాయాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమకూర్చుకుంది. లైఫ్‌ ట్యాక్సుల ద్వారా సగానికి పైగా ఆదాయం వచ్చింది. దీని ద్వారా ఏకంగా రూ.2232.32 కోట్ల మేర వచ్చింది. ఇందులో రంగారెడ్డి జిల్లాలో రూ.1243.05 కోట్లు, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా నుండి రూ.99.13 కోట్లు, వికారాబాద్‌ జిల్లా నుండి రూ.50.14 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కొత్త వాహనాల కొనుగోళ్ల విషయంలో రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. వీటి ద్వారా లైఫ్‌ ట్యాక్సు వసూలవుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని వాహనాలు కలిపి 30లక్షల పైమాటే. ప్రతి సంవత్సరం కొత్త వాహనాల కొనుగోళ్లు అధికంగా ఉంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement