Tuesday, May 7, 2024

యూనివర్సిటీల్లో కోచింగ్‌ సెంటర్లు లేవ్‌.. పోటీ పరీక్షల శిక్షణ కోసం విద్యార్థుల ఎదురుచూపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టాలెంట్‌ ఉన్నా సరైనా అవకాశాలు లేక చాలా మంది విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. ఇలాంటి వారికోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి ముందు చూపుతో ఆలోచన చేసి యూనివర్శిటీల్లో కోచింగ్‌ కేంద్రాలు పెట్టాలని వర్శిటీ వీసీల సమావేశంలో గత ఫిబ్రవరి నెలలో నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రంలో సాంప్రదాయ కోర్సులను అందించే ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్శిటీల్లో చదివే విద్యార్థుల కోసం కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు నిధులను కూడా మంజూరు చేసింది. ఆరు వర్శిటీలకు కలిపి రూ.18 లక్షలను మంజూరు చేసింది. ఇందులో ఉస్మానియా వర్శిటీకు రూ.5 లక్షలు, కాకతీయ వర్శిటీకు రూ.4 లక్షలు, మిగతా నాలుగు వర్శిటీలకు కలిపి రూ.9 లక్షల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను ఫిబ్రవరి నెలలో మంజూరు చేసినట్లు సమాచారం. నిధులు విడుదలై నెలలు గడుస్తున్నా ఇంత వరకూ వర్శిటీల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్‌ కేంద్రాలు అందుబాటులోకి రాలేదు. అయితే ఒక్క పాలమూరు యూనివర్శిటీ క్యాంపస్‌లో మాత్రం జనవరి నెల నుంచే వర్శిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ను ప్రారంభించారు. కానీ మిగతా ఐదు వర్శిటీల్లో మాత్రం కోచింగ్‌ కేంద్రాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఉద్యోగ ప్రకటనలకు ముందే కోచింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలనే డిమాండ్‌ విద్యార్థుల నుంచి వస్తోంది. ఈ నెలలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కూడా వెలువడనుంది. ఇంకెప్పుడు ఉచిత కోచింగ్‌ను ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉస్మానియా వర్శిటీలో సివిల్‌ సర్వీస్‌ అకాడమీని స్థాపించబోతున్నారు. మిగతా వర్శిటీల్లో గ్రూప్స్‌, పోలీస్‌ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవి అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్స్‌, పోలీస్‌, ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, బ్యాంక్‌ ఎగ్జామ్స్‌ ఇతర పోటీ పరీక్షలకు ఏటా లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్‌ అవుతూ ఉంటారు. తమ కలల కొలువును సాకారం చేసుకోవడానికి కొందరు రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్‌ సెంటర్లలో కోచింగ్‌ తీసుకుంటుంటే… మరి కొందరు మాత్రం కోచింగ్‌కు డబ్బుల్లేక యూనివర్సిటీ లైబ్రరీల్లో స్వతహాగానే ప్రిపేర్‌ అవుతుంటారు. ఇలాంటి వారికోసం రాష్ట్రంలోని 6 ప్రధాన యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు కోచింగ్‌ అందించేందుకు సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

కాకతీయ వర్సిటీ క్యాంపస్‌లో 200 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు పోలీస్‌ ఉద్యోగాలకు కోచింగ్‌ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. శాతవాహన వర్సిటీలోనూ విద్యార్థులకు అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్‌ అందించనున్నారు. అయితే అవసరమైన నిధులను మంజూరు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలికి వర్సిటీ అధికారులు కోరినట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ఎలాంటి స్క్రీనింగ్‌ టెస్టు లేకుండానే కోచింగ్‌ ఇవ్వాలని వర్సిటీలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే కాకతీయ వర్సిటీతో పాటు ఇతర వర్సిటీలు సైతం బ్యాచ్‌కు సుమారు 100 నుంచి 200 మంది విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు రచించినట్లుగా సమాచారం. దరఖాస్తుల సంఖ్యను బట్టి విద్యార్థులకు బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. యూనివర్సిటీ ఫ్యాకల్టిdతో పాటు ఆయా సబ్జెక్టుల్లో నిపుణులతో కోచింగ్‌ ఇచ్చేలా వర్సిటీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement