Tuesday, April 30, 2024

వరివద్దన్నా.. అదేనా.! ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతన్నలు ససేమిరా..

తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలు పక్కదారి పట్టాయా, వద్దన్న వరి పంటే అధిక విస్తీర్ణంలో సాగవుతున్నదా అంటే ప్రస్తుతం సాగవుతున్న పంటలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ భావించినా అధికారుల అంచనా మేరకు ఆయా ప్రత్యామ్నాయ పంటలు సాగుకాకపోవడం గమనార్హం. ఇదే సమయంలో వద్దన్న వరి పంటను రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ యాసంగిలో ఇప్పటివరకు 32,08,739 ఎకరాల్లో సాగుకాగా, వీటిలో వరి పంట 19,18,661 ఎకరాల్లో సాగైంది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సూచించినప్పటికీ ఆయా పంటలకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థలు విఫలమయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారంగా పేరుగడించినప్పటికీ విత్తన కొరత ఏర్పడడం గమనార్హం.

ఎటు చూసినా వరే..

యాసంగి సీజన్‌ మరో వారం పది రోజుల్లో పూర్తి కావొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎటు చూసినా వరి పంటే సాగవుతుంది. వాస్తవంగా యాసంగిలో మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో పండాల్సి ఉన్నా గతేడాదికంటే ఈ సారి లక్ష ఎకరాల్లో తక్కువగా సాగవుతున్నది. వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించిన గణాంకాల ప్రకారం అన్ని పంటలు కలుపుకుని 32.08లక్షల ఎకరాల్లో సాగయ్యాయిని తెలిపింది. వీటిలో అధిక విస్తీర్ణంలో వరి ఉంది. ఈ సారి ప్రభుత్వం వరి పంటను కొనుగోలు చేసేది లేదని తేల్చిచెప్పినా.. రైతులు సాగు చేయడంపై అధికారులు అయోమయానికి గురవుతున్నారు. మిల్లర్లు ఉన్న ప్రాంతంలో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉన్నా.. ఎంతమేరకు కొనుగోలు జరుగుతుందన్నది తెలియాల్సి ఉంది. అయితే గతంలో యాసంగిలో దొడ్డు రకం వరినే సాగుచేసేవారు. కానీ మారిన పరిస్థితుల రీత్యా ఈ యాసంగిలో సన్నాలను సాగుచేస్తున్నారు. సన్నాలైతే తినేందుకు వినియోగించడంతో పాటు కొనుగోలుకు అవకాశాలు మెరుగుపడతాయని అన్నదాతలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వారంతో పోల్చుకుంటే ఫిబ్రవరి 2 వరకు 19,18,661 ఎకరాల్లో వరి సాగవ్వగా, గతవారం కంటే ఈ వారం వరకు సుమారు 5,22,777 ఎకరాల్లో అధికంగా వరి సాగైంది.

శనగ, వేరుశనగ పెరగలేదు..

తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో ఆయా ప్రాంతాలను బట్టి పలు రకాల పంటలు పండు తుంటాయి. ఇందులో ఆదిలాబాద్‌లో ప్రధాన పంట అయిన సోయాకు అవసరమైన విత్తనాలను అధికారులు అందించలేక పోవడంతో అక్కడి రైతులు ఇతర ప్రాంతాల నుంచి సోయా విత్తనా లను తీసుకువచ్చి మరీ సాగుచేశారు. ఇదే క్రమంలో వేరుశనగ, శనగను రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగుచేయించాలని వ్యవసాయ శాఖ సమీక్షలో మంత్రి సైతం అధికారులు సూచించినా.. కేవలం అది మహాబూబ్‌ నగర్‌ జిల్లాకు మాత్రమే పరిమితమైంది. కాగా గతేడాది కంటే ఈ యాసం గిలో వేరుశనగ కేవలం లక్ష ఎకరాల్లో మాత్రమే పెరిగింది. మొత్తానికి విత్తన భాండాగారంలో ఏర్పడిన విత్తన కొరత వలనే ప్రత్యామ్నాయ పంటల సాగులో అంతరాయం ఏర్పడినట్టు తేటతెల్లమవుతోంది.

- Advertisement -

వరి మినహా అన్ని పంటలు నామమాత్రమే..

ఈ ఏడాది సాగుచేయించదల్చిన పంటల్లో ఏ ఒక్క పంట కూడా ఆశించిన మేరకు సాగుకావడం లేదు. వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిస్తున్న గణాంకాలను పరిశీలిస్తే ఒక్క వరి తప్ప మిగతా ఏ పంట కూడా అధికంగా సాగుకావడంలేదన్నది స్పష్టమవుతోంది. జొన్నలు ఇప్పటివరకు 79,514 ఎకరాల్లో, మొక్కజొన్న 3,04,306, శనగ 3,33,131, వేరుశనగ 3,18,333, మినుము 74,699, పొద్దు తిరుగుడు 27,507, కుసుమ 14,682, ఆముదం 12,245 ఎకరాల్లో సాగయ్యాయి. అధికంగా సాగు చేయించాలనుకున్న చిరు, తృణ ధాన్యాలు అంతంతమాత్రంగానే సాగవ్వడం గమనార్హం. వీటిలో సజ్జలు 548 ఎకరాల్లో, రాగులు 1,471, కొర్రలు 573, ఇతర మిల్లెట్‌ పంటలు 128ఎకరాల్లో సాగయ్యాయి. మొత్తానికి ఈ యాసంగిలో వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థల వైఫల్యంతో ప్రత్యామ్నాయ పంటల సాగు తగ్గిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

సీడ్‌ హబ్‌లో విత్తన కొరత..

తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారంగా అవతరించిందని వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థలు చెబుతున్నాయి. కానీ ఇదే విత్తనభాండా గారంలో ప్రభుత్వం సూచించిన ప్రత్నామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇదే సమయంలో ప్రైవేటు మార్కెట్‌లో ఆయా విత్తనాలు లభించడం, ప్రభుత్వంలో లభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు విత్తనాలను అధిక ధరలకు విక్రయించారు. అయితే వ్యాపారులు అడ్డగోలుగా విక్రయాలు జరుపుతున్నా అధికారుల తనిఖీలు, జరిమానాలు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ సారి యాసంగిలో వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయించాలని ప్రభుత్వం కొన్ని రకాల పంటలను సైతం సూచించింది. కానీ వ్యవసాయ శాఖ యాసంగి పంటల ప్రణాళికనే ప్రకటించకపోగా, అవసరమైన విత్తనాలను సైతం అందుబాటులోకి తీసుకురావడంలో తీవ్రం గా విఫలమైంది. దీంతో ఈ సారి యాసంగిలో ప్రభుత్వ నిర్ణయంమేరకు వరి విస్తీర్ణం తగ్గకపోగా, ప్రత్యామ్నాయ పంటలూ పెరగలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement