Tuesday, April 30, 2024

ఈ ఏడాది ఘ‌నంగా జాతీయ చేనేత దినోత్స‌వాన్ని నిర్వ‌హిద్దాం – కెటిఆర్ పిలుపు

హైద‌రాబాద్ – ప్రతి ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో చేనేత వారోత్సవాలు జరగనున్నాయి. దీంతోపాటు 7 తేదీ నుంచి 14వ తేదీ వరకు పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన కొనసాగుతుంది. సరూర్‌న‌గ‌ర్ ఇండోర్ స్టేడియంలో 7500 మంది నేతన్నలతో రాష్ట్రస్థాయి చేనేతల సంబరాలను నిర్వహించనున్నాం. కేవలం సంబరాలే కాకుండా ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక నేతన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించబోతున్నది. చేనేత మిత్ర కార్యక్రమాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేతన్నలకు సమగ్ర ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. దీనికి అదనంగా నేత్ననకు బీమా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించబోతున్నాం. ప్రస్తుతం ఉన్న పిట్ లూమ్స్ ను ఫ్రేమ్ లూమ్స్ గా అప్ గ్రేడ్ చేసేందుకు తెలంగాణ చేనేత మగ్గం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. హైదరాబాద్‌లోని శిల్పారామంలో చేనేత హ్యాండీక్రాఫ్ట్ మ్యూజియం, ఉప్పల్ భ‌గాయత్‌లో కన్వెన్షన్ సెంటర్‌కు శంఖుస్ధాపన చేయనున్నాం అని కేటీఆర్ తెలిపారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారితో పంచుకోవాలని ప్రత్యేకంగా ప్ర‌జాప్ర‌తినిధులంద‌రినీ కోరారు. . ఇందులో భాగంగా ఆయా పరిధిలో ఉన్న నేతన్నలతో జాతీయ చేనేత దినోత్సవ సంబురాల్లో కలిసి పాల్గొని, వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement