Sunday, May 5, 2024

సఖీ కేంద్రంతో మహిళలకు రక్షణ : పమేలా సత్పతి

సఖి కేంద్రం ద్వారా మహిళల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈరోజు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సఖి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సఖి కేంద్రం ద్వారా మహిళల కోసం చేపట్టిన చర్యలను సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సఖి కేంద్రం ద్వారా మహిళల కోసం ప్రధానంగా వైద్యం, వసతి, రక్షణ, న్యాయ సేవలు, కౌన్సెలింగ్ సేవలు సంబంధిత శాఖల సమన్వయంతో అందించాలన్నారు. బాధితుల కోసం సైకియాట్రిస్ట్ ను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలను వివరించాలన్నారు.

ఇందుకోసం జిల్లా పంచాయతీ అధికారి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నవంబర్ ఒకటి, 2019 సంవత్సరం నుండి జిల్లాలో సఖి కేంద్రం నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటి వరకు 577 కేసులు రిజిస్టర్ కాబడ్డాయని, అందరికీ రక్షణ, వసతి, న్యాయ, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం 181 హెల్ప్ లైన్, బాలల రక్షణ కోసం 1098 హెల్ప్ లైన్ పని చేస్తున్నాయని, ఎలాంటి సమస్యలున్నా హెల్ప్ లైన్ సేవలు తీసుకోవాలని ఆమె ప్రజలను కోరారు. సఖి కేంద్రంలో రక్షణ కోసం ఒక మహిళా పోలీసు, హోంగార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణరెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశం, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ జోసెఫ్, భువనగిరి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చిన్ని నాయక్, సఖి కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ ప్రమీల, లావణ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement