Saturday, May 4, 2024

యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి మా ఇల‌వేల్పు

యాదాద్రి : యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహస్వామివారిని ద‌ర్శించుకున్నారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చారిత్రాత్మకమని.. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ చ‌రిత్రలో నిలిచిపోతారని అన్నారు. బ‌డ్జెట్ లో అన్నివ‌ర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్ద పీట వేశారని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య అధికారులు, అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగ‌తం ప‌లికారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు, స్వామివారి శేష వ‌స్త్రంతోపాటు ఆశీర్వచ‌నాలు అంద‌జేశారు.అనంతరం మంత్రి ద‌యాక‌ర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రి పున‌ర్నిర్మాణ ప‌నులు మ‌రికొద్ది రోజుల్లో పూర్తవుతాయి. సీఎం కేసీఆర్ యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఆల‌య విశిష్టత‌ను ఇనుమ‌డింపజేసేలా ప‌నులు శ‌రవేగంగా సాగుతున్నాయి’ అని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఘన విజ‌యం ఖాయమని, నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లోనూ తిరుగులేని విజయం సాధిస్తామని అన్నారు. యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి త‌మ ఇల‌వేల్పు అని.. అందుకే త‌ర‌చూ ఆల‌యాన్ని సంద‌ర్శిస్తానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని స్వామివారిని మొక్కుకున్నట్లు మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement