Sunday, May 5, 2024

ప్ర‌తి గింజ‌ను కొనుగోలు చేయాలి : డీసీసీ కుమార‌స్వామి

రైతులు పండించిన‌ ప్రతి గింజను కొనుగోలు చేయాలని డీసీసీ అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి అన్నారు. గురువారం గోవిందరావుపేట మండల కేంద్రంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ ఆధ్వర్యంలో రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలని ధర్నా మరియు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి హాజరై మాట్లాడుతూ… రైతన్నకు అన్యాయం చేస్తే సహించేది లేదని వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాటలో రైతులు బలవుతున్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతన్నను గందరగోళంలోకి నెట్టివేస్తున్నారని అన్నారు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు పంటను కొనుగోలు చేయక దిక్కు లేక ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలు ఒకరి మీదకు ఒకరు నెట్టివేసుకుంటూ చేతులు దులుపుకుంటున్నాయని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళారులు రైతన్నలను మోసం చేస్తున్నారని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని, సహకార సంఘం మరియు ఐకేపీ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎఫ్.సి.ఐ. తరలించి మళ్ళీ బియ్యాన్ని రేషన్ షాపులకు పంపించేటట్లు చేశారని, రైతులకు పెద్ద పీట వేస్తూ పహానిల ద్వారా పంట ఋణాలు అందించారని అన్నారు.

రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ అందించారని, ఇందిర జల ప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేయించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి అయిన మేల్కొని వెంటనే ధాన్యం కేంద్రాలు ప్రారంభించి, కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని చేయకపోతే మాత్రం రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, రైతుల తరపున పోరాటాలకు మేము సిద్ధం అని, ప్రతి గింజను కొనుగోలు చేసేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ , కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు కుర్సం కన్నయ్య, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, ములుగు ఎంపీటీసీ మావూరపు తిరుపతి రెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సూడి సత్తిరెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య రాజు, యూత్ అధ్యక్షులు చింత క్రాంతి, మండల ప్రధాన కార్యదర్శులు వేల్పుగొండ పూర్ణ, మూడ్ ప్రతాప్, జంపాల చంద్రశేఖర్, ఎంపీటీసీలు గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, ధారావత్ పూర్ణ- గాంగు, సహకార సంఘ సభ్యులు పాశం మాధవరెడ్డి, జెట్టి సోమయ్య, సర్పంచులు ముద్దబోయిన రాము, లావుడియా లక్ష్మీ- జోగ నాయక్, భూక్య సుక్య, సనప సమ్మయ్య, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, సామ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement