Monday, April 29, 2024

ఆక్సిజన్ ప్లాంట్ పూర్తయ్యేలా చూడండి: కిషన్ రెడ్డికి రేవంత్ విజ్ఞప్తి

మల్కాజ్‌గిరి కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు రేవంత్ బుధవారం కిషన్ రెడ్డికి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎంపీగా తన వంతు బాధ్యతగా కంటోన్మెంట్ బొల్లారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేశామని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోని బాధితుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని రెండు వారాల కిందటనే నిర్ణయించినట్లు రేవంత్‌ చెప్పారు. అందుకు సంబంధించిన ప‌నులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.

ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించడంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం అత్యంత కీలకమన్నారు. పీఎం కేర్ నిధుల ద్వారా బొల్లారం ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్షవ‌ర్ధన్, డీఆర్‌డీవో ఛైర్మన్ స‌తీశ్​ రెడ్డికి లేఖలు రాసినట్లు రేవంత్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని రేవంత్ కిషన్ రెడ్డిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement