Tuesday, May 7, 2024

TS: పాలమూరు నుంచే ఎన్నికల శంఖారావం మోగించనున్న మోడీ .. జితేందర్ రెడ్డి

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 23 (ప్రభ న్యూస్): పాలమూరు నుంచే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల శంఖారావం మోగించనున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈనెల 30వ తేదీన పాలమూరు జిల్లాకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారని, ప్రధాని మోడీ పాలమూరుకు రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావం పాలమూరు నుంచి ప్రధాని మోడీ మోగియనున్నట్లు తెలిపారు. జి20 సమావేశాలు, చంద్రయాన్ 3, చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ లాంటి అనేక విజయాలను సాధించి ప్రపంచ దేశాల్లో సైతం ప్రఖ్యాత గ్రహించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని సూచించారు. ఎన్నో ఏళ్లుగా అమలుకు నోచుకోని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన మొదటిసారి పాలమూరుకు రావడంతో మహిళల చేత భారీ స్వాగతం పలికి అభినందనలు తెలుపుతామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హడావుడిగా పూర్తికాని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారని ఎద్దేవా చేశారు. 31మోటార్ పంపులు ఉండాల్సిన చోట ఒక 1మోటారుతో ప్రాజెక్టును ప్రారంభించి పాలమూరు జిల్లా ప్రజలను మరోసారి మోసం చేశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గోల్కొండ ఖిల్లా మీద బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ జి మాట్లాడుతూ… ఈనెల 30న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన జిల్లా కేంద్రంలో ఉంటుందని తెలిపారు. దీనికోసం జిల్లా నాయకత్వం క్షేత్రస్థాయిలోని భాజపా కార్యకర్తలు అత్యధికంగా జన సమీకరణ చేపట్టాలని సూచించారు. ఆ తర్వాత మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ… కర్ణాటకలో మోసపూరిత ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేస్తామని చెప్తున్నా ఇక్కడి ప్రజలు వారిని నమ్మడం లేదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభించి పాలమూరు జిల్లాలోని రైతులకు సాగునీళ్లు ఇచ్చినట్లు హైదరాబాదులో ఎక్కడ చూసినా కటౌట్లు, బ్యానర్లు కట్టి డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ జిమ్మిక్కులను ఇక్కడి ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం పాలమూరు జిల్లా కేంద్రం మీదుగా అనేక నేషనల్ హైవేలు పునరుద్ధరణ చేసి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగు పరచడం జరిగిందన్నారు. ఇక్కడున్న హైవేలను చూస్తే అమెరికాలో ఉన్న రహదారులను సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలు గర్వించే విధంగా చంద్రయాన్- 3ని ప్రయోగించి ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా భారతదేశాన్ని నిలపడం జరిగిందన్నారు. అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణలో రావాలని ఇక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజా రెడ్డి, ఎగ్గని నర్సింలు, పడకుల బాలరాజు, సుదర్శన్ రెడ్డి, మక్తల్ కొండయ్య, జలంధర్ రెడ్డి, జిల్లా నాయకులు పి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కృష్ణవర్ధన్ రెడ్డి, క్రిస్టియ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement