Tuesday, May 7, 2024

MLC Kavitha – మ‌హిళా బిల్లుపై బిజెపి మోసం … మెజార్టీ ఉన్నా ఆమోదించ‌డం లేద‌ని ఆగ్ర‌హం

హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచి మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ టికెట్ల పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ల పంపిణీపై వెళ్లగకుతున్న అక్కసును తాము అర్థం చేసుకుంటున్నామని, టికెట్లు రాని అభ్యర్థులను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మీ రాజకీయ అభద్రతాభావాన్ని మహిళ ప్రాతినిధ్యానికి ముడి పెట్టవద్దని హితవు పలికారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం ఉంది కాబట్టే దేశంలో 14 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురానిదే పరిస్థితుల్లో మార్పు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు మహిళలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తాయో చూద్దామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement