Saturday, April 27, 2024

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చరు… ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయరు

తెలంగాణను కరోనా రెండో వేవ్ అతలాకుతలం చేస్తుంటే పేద, మధ్య వర్గాల ప్రజలకు ఉచిత చికిత్స అందించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఎటువంటి నిధులు కేటాయించకుండా, తనపై ఆర్ధిక భారం పడకుండా తప్పించుకొనే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను కరోనా రోగులకు అందకుండా చేస్తోందని ధ్వజమెత్తారు. కార్పొరేట్  ఆస్పత్రులకు మేలు చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఘనంగా చెప్పుకొనే ‘ఆరోగ్య శ్రీ’లో కరోనా చికిత్సను చేర్చలేదని, అటు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య భీమా పధకం ‘ఆయుష్మాన్ భారత్’ను అమలు చేయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడాలనే సోయి కేసీఆర్ కు ఉంటె  తెలంగాణలో ఆరోగ్యశ్రీ , ఆయుష్మాన్ భారత్ పథకాలను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని రాజసింగ్ డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల బకాయిలను వెంటనే చెల్లించి ఆ తర్వాత కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని  కోరారు.    

ప్రస్తుతం రాష్ట్రంలో 21 వేల మంది కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో సగటున ప్రతి ఒక్కరూ రోజూ రూ.50 వేల దాకా ఫీజులు చెల్లించాల్సి వస్తోందన్నారు. అంటే రోజూ రూ.100 కోట్ల  దాకా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నాయని వివరించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేరుస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్.. గత ఏడు నెలలుగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కరోనా రెండో  వేవ్ తీవ్రమైనప్పటి నుంచీ కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లు లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయని రాజాసింగ్ తెలిపారు. పైరవీలు చేసుకుంటే కానీ బెడ్లు దొరకడం లేదన్నారు. ఒక వేళ దొరికినా కనీసం లక్ష, రెండు లక్షలు అడ్వాన్  కట్టాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. రోజూ లక్షల్లో బిల్లులు వేస్తున్నారని,  ప్రభుత్వ  ఆస్పత్రులకు వెళితే.. సౌకర్యాలు సరిగ్గా ఉండటం లేదన్నారు.

కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లకు దాదాపు 5 వేల ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోందని తెలిపారు. అయితే ఈ ఫిర్యాదులపై ప్రభుత్వం అసలు స్పందించడం లేదన్నారు. ఇంతవరకు ఏ ఒక్క ఆస్పత్రిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ కింద ఇతర వ్యాధుల రోగులకు చికిత్స చేసిన ఆసుపత్రులకు ఇప్పటికే ప్రభుత్వం సుమారు రూ. 500 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఆ బిల్లులు చెల్లించాలని ఆసుపత్రులు ఒత్తిడి తెస్తున్నాయని చెప్పారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీలో కరోనా చికిత్సను  చేరిస్తే ప్రభుత్వంపై మరింత భారం పడుతుంది. దీన్ని భరించే ఆలోచనలో ప్రభుత్వం లేదు’’ అని ఆర్ధిక శాఖ అధికారులు అభ్యంతరం చెబుతున్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’లో రాష్ట్రం చేరితే.. ఎందరికో ప్రయోజనం చేకూరనుందని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement