Saturday, May 18, 2024

సమన్వయం కాదు.. ఇక సమరమే: TRS ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుండి ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టతకు పని చేస్తూ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభ అంశాలపై శనివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు ఉద్యమ నాయకుడే తొలి ముఖ్యమంత్రి అయిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని, ఇకనుండి గ్రామస్థాయి నుండి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారని తెలిపారు. ప్రతిపక్షాల పసలేని విమర్శలను, అసత్య ప్రచారాలను ఆధారాలతో తిప్పికొట్టాలని కోరారు.

గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎవరిని విమర్శించిన పార్టీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని పనిలేదని, ప్రతిపక్షాలకు ఘాటుగా బదులు ఇవ్వాలని కోరారు. పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని, క్రమశిక్షణతో పనిచేసినప్పుడే రాజకీయాల్లో ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు. నవంబర్ 15వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్న విజయ గర్జన సభకు ప్రతి గ్రామం నుండి 200 మంది కార్యకర్తలు తరలిరావాలని కోరారు. 2018 లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి రికార్డు స్థాయిలో 40వేల మంది హాజరయ్యారని, అదే స్థాయిలో విజయ గర్జన సభకు హాజరై విజయవంతం చేయాలన్నారు. అనంతరం మండల పరిధిలోని 19 గ్రామాల టిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి వెంకట రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీలు గాయత్రి పాండు, శ్రీశైలం యాదవ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు మేరాజ్ ఖాన్, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: TS: పోడుకు పరిష్కారం.. ఇయ్యాల్నే డిసైడైతది!

Advertisement

తాజా వార్తలు

Advertisement