Monday, April 29, 2024

నాలుగు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలి

సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న చర్యలను ప్రధాని మోదీ పునరాలోచించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కోరారు. సింగరేణికి కేటాయించిన నాలుగు బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు భూపాలపల్లిలో నిర్వహిస్తున్న 72 గంటల సమ్మె శనివారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి టీబిజీకేఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఓసి 2 వద్ద నిర్వహించిన ధర్నాలో సింగరేణి కార్మికులతో కలిసి పాల్గొని టీఆర్ఎస్ పార్టీ తరుపున మద్దతు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని మండిపడ్డారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణికి కేటాయించిన నాలుగు బ్లాక్ లను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది చూస్తోందన్నారు. మోదీ ప్రధానమంత్రి కావడానికి ఆర్ధికంగా సహాయం చేసిన అధాని,అంబానీలకు బొగ్గు బ్లాకులను కారు చౌకగా ధారాదత్తం చెయ్యాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. సింగరేణి కార్మికులు బాధతో చేస్తున్న సమ్మెకు టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం సంఘీభావం తెలుపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించిన నాలుగు బ్లాక్ ల వేలం పాటను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు బ్లాక్ లను దశాబ్దాల చరిత్ర కలిగి సమర్ధవంతంగా నిర్వహిస్తూ లాభాల బాటలో నడుస్తూన్న సింగరేణి కాలరీస్ కంపెని లిమిటెడ్ సంస్థకు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకుల వేలం రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో కార్మికులతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement