Monday, April 29, 2024

Miriyalaguda -! బలం ఇవ్వండి – కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి హామీలను అమలు చేయిస్తా… కెసిఆర్

మిర్యాలగూడ – లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి బలం ఇస్తేనే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వచ్చి హామీలను అమలు చేయిస్తామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ అన్నారు. బస్‌యాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తమంటున్నరు. కేసీఆర్‌ను తీసుకుపోయి చర్లపల్లి జైలులో వేస్తమంటరు. జైళ్లకు.. తోకమట్టకు కేసీఆర్‌ భయపడుతడా? అట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా? 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను తెచ్చాం. ఈ రోజు నిన్ను జైలులో వేస్తాం. నీ పేగులు తీసి మెడలో వేసుకుంటం. నీ గుడ్లుపీకి గోళీలు ఆడుతం.. ఇదా ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషా. మిమ్మల్ని పండపెట్టి తొక్కుతం ఇదే భాషనా ? ఓ ముఖ్యమంత్రి నుంచి ఆశించేది ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాషా..

‘15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి.. 10 సంవత్సరాలు తెలంగాణను ప్రజలను కులం, మతం, వర్గమనే బేధం లేకుండా అన్నివర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసిన వ్యక్తిని పట్టుకొని.. నీ గుడ్లు పీకుతా.. నీ పేగులు మెడలో వేసుకుంటా. నిన్ను జైలులో వేస్తా ఇదా మాట్లాడాల్సిన భాషా. ప్రజలు ఆలోచన చేయాలి. అన్నీ అబద్ధాలు చెబుతూ, శ్వేతపత్రాలు విడుదల చేసి.. బోగస్‌ మాటలు చెబుతూ.. ఇచ్చిన హామీలను ఎగవెట్టి.. ఆరు హామీలకు పంగనామం పెట్టి.. ఈ రోజులు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నరు. ఎంత మంచిగ నీరు వస్తుండే నాగార్జున సాగర్‌లో. ఎంత బ్రహ్మాండంగా పండుతుండే. మాకు చాలా సంతోషంగా ఉంటుండే. 18 పంటలు పండించాం సాగర్‌ కింద.చివరి భూములకు కూడా నీళ్లు ఇచ్చాం. కృష్ణలో నీళ్లు తక్కువైనా కాళేశ్వరం నీళ్లు తెచ్చి.. మూసీ నదిలో వేసి.. ఉదయసముద్రానికి తీసుకువచ్చి.. పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కి కలపాలి.. శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలకు కరువు ఉండకూడదని ప్రణాళికలు రూపొందించాం. కానీ, ఇవాళ అన్నీ బంద్‌.

- Advertisement -

కేసీఆర్‌ ఆనవాళ్లు తీసేస్తామంటున్నరు..‘కేసీఆర్‌ ఆనవాళ్లు తీసేస్తాం అంటున్నరు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పుణ్యమా అని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయనను గౌరవించాలని.. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల ఎత్తులో హిమాలయమంత అంబేద్కర్‌ విగ్రహం హైదరాబాద్‌లో పెడితే.. మొన్న జయంతి రోజున ముఖ్యమంత్రి.. మంత్రులు ఎవరూ పోలేదు. ఆ మహనీయుడికి ఒక్క దండ వేయలేదు. గేట్లకు తాళం వేశారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ తిట్టుకుంటూ వెళ్లారు. ఇవన్నీ అడ్డగోలు మాటలు.. నిందలు.. అవనసరమైన కథలు చెబుతున్నరు తప్ప న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలకు, కాంగ్రెస్‌కు పంచాయితీ పడ్డది. ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడేటటువంటి పంచాయితీ పెద్ద కావాలి. ఆ పంచాయితీ పెద్ద ఎవరు కేసీఆరేనా? బీఆర్‌ఎస్‌ పార్టీయేనా? నిన్ననే అన్ని విషయాలు చెప్పాను. తప్పకుండా మళ్లీ మన రాజ్యమే వస్తది. అందులో అనుమానం లేదు. ఎవడూ ఆపలేడు. బ్రహ్మాండంగా తెలంగాణ.. మనం కలగన్న బంగారు తెలంగాణ అయ్యేదాక మనం అద్భుతంగా తీసుకుపోవాలి’ అన్నారు.

తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం..

ఆ నాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. ఈ జిల్లాల్లో మంత్రులున్నారు. ఇరిగేషన్‌ మినిస్టర్‌ స్వయంగా ఇక్కడ ఉన్నడు. వీళ్లు దద్దమ్మల్లా పోయి నాగార్జునసాగర్‌ కట్టపై కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి అప్పగించారు. మీరంతా కళ్లారా చూశారు. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా. 1956 నుంచి ఈ నాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్‌ పార్టీ. 56వ సంవత్సరంలో ఏపీలో కలిపి 58 సంవత్సరాలు అనేక రకాలుగా గోసపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. మొన్న ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చింది. నోటికి మొక్కాలి అన్ని హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి.. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి మనకు అవస్థలు తెచ్చిపెడుతున్నారు.

రైతుబంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడుతా అని ఒక మంత్రి మాట్లాడుతున్నడు. చెప్పులు మీకే లేవు రైతులకు కూడా ఉంటయ్‌, వాళ్ల చెప్పులు చాలా బందబస్తుగా ఉంటయ్‌ అని నేను చెప్పిన’ అంటూ గుర్తు చేశారు కేసీఆర్‌.

దద్దమ్మలు సాగర్‌ను కేంద్రం చేతుల్లో పెట్టారు..

‘బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో 18 పంటలకు ఏమాత్రం వెనుకాముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్‌ ఆయకట్టంతా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించాం. ఇవాళ ఈ రోజు ఏమైంది? సాగర్‌లో నీళ్లు ఉండే.. ఇవ్వగలిగే అవకాశం ఉండే. ఈ దద్దమ్మలకు దమ్ములేక.. ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్‌ఎంబీ చేతులో పెట్టి పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినయంటే ఇదే మొదటిసారి.

పోయింది కరెంటు ? ఏమైంది కరెంటుకు ? వీళ్లు కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వి పని చేయాల్సిన అవసరం లేకున్నా కేసీఆర్‌ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు రాజ్యమేలుతున్నరు. కరెంటు ఎందుకు ఆగమవుతుంది’ అంటూ రేవంత్‌ సర్కారును కేసీఆర్‌ ప్రశ్నించారు.

రైతుబంధులో ధగా.. రైతుబీమా ఉంటదో ఊడుతదో తెలియదు. బ్రహ్మాండంగా కేసీఆర్‌ ఉన్నన్ని రోజులు రెప్పపాటు పోని కరెంటు కటుక బంద్‌చేసినట్లే మాయమైంది. . ఎక్కడికి పోయింది కరెంటు ? ఏమైంది కరెంటుకు ? వీళ్లు కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వి పని చేయాల్సిన అవసరం లేకున్నా కేసీఆర్‌ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు రాజ్యమేలుతున్నరు. కరెంటు ఎందుకు ఆగమవుతుంది’ అంటూ రేవంత్‌ సర్కారును కేసీఆర్‌ ప్రశ్నించారు

ప్రజలను ఎందుకు బాధపెడుతున్నరు ?

‘ప్రజలను ఎందుకు బాధలుపెడుతున్నరు? మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేం చేశాం. ఆ మాత్రం మీకు చేయచేతనైతలేదా? సరఫరా జరిగిన కరెంటును అలాగే ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? మిషన్‌ భగీరథతో మంచినీళ్లు తెచ్చి అర్బన్‌ ఏరియాలో.. మున్సిపల్‌ ఏరియాలో అన్నివర్గాల పేదలకు దొరకాలని ఒక్కరూపాయికే నల్లా కనెక్షన్‌ ఇచ్చాం. ప్రతి ఇంట్లో నల్లా బిగించి ప్రతి ఇంటికీ నళ్లా నీరందించాం. ఇవాళ మిషన్‌ భగీరథ ఎందుకు నడుపలేకపోతున్నరు. మీ తెలివితక్కువ తనం ఏందీ? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఆ నాడు నీళ్లకోసమే గోస. నాలుగైదు నెలలకే.. కేసీఆర్‌ పక్కకు జరుగంగనే ఎందుకు మాయమై పోయినయ్‌ ? ఎందుకు బాధపడుతున్నరు ? సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ను తిట్టాలి పబ్బం గడుపుకోవాలి..

‘ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కేసీఆర్‌ను తిట్టడం ఒకటే పని. కేసీఆర్‌ను తిట్టాలి పబ్బం గడుపుకోవాలి తప్పా.. పంటలు ఎండబెట్టారు.. రైతుబంధు ఎగొట్టారు.. రైతుబంధు ఐదెకరాలు అని మాట్లాడుతున్నారు. ఏం పోయింది మీ అబ్బసొత్తా ? ఇచ్చేందుకు మీకు ఏం బాధైంది. ప్రభుత్వం సహాయం లేకుండా ప్రపంచంలో ఎక్కడా రైతులు వ్యవసాయం చేయడం లేదు. దాన్ని గమనించే భారతదేశంలో తొలిసారిగా రైతులకు అండగా ఉండాలని, అప్పులు తీరాలని బడ్జెట్ నుంచి రూ.15వేలు-రూ.16వేలకోట్లు పెట్టి రైతుబంధు ఇచ్చాం.

నేను వస్తుంటే ఆర్జాలబావి దగ్గర బస్సును రైతులు ఆపారు. సార్‌ 20 రోజులైంది ధాన్యం తెచ్చి ధాన్యం కొనడం లేదని చెప్పారు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి ? బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోదీ వడ్లు కొన అని మొండి కేస్తే.. ముఖ్యమంత్రితో సహా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో ధర్నా చేసి.. నరేంద్ర మోదీ మెడలు వంచి.. మా తెలంగాణ పండిస్తున్నది. న్యాయంగా కొనాలి అని చెప్పి కొనుగోలు చేసేలా చేశాం. మద్దతు ధర రూపాయి తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో వేశాం’ అన్నారు.

ఈ ప్రేమను జీవితాంతం మరిచిపోలేను

..‘పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బలం ఇస్తే.. అది తెలంగాణ ప్రజల బలం అవుతుంది. తెలంగాణ ప్రజల శక్తి అవుతుంది. మీ తరఫున ప్రభుత్వం మెడలు వంచగలుగుతం. ఇవాళ మీరు చూపించిన ప్రేమ, పలికిన స్వాగతం నా జన్మలో మరిచిపోను. ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేసినందుకు సంతోషం. కానీ, మే 13వ తేదీ వరకు ఇదే ఉత్సాహం కొనసాగించి పార్లమెంట్‌ ఎన్నికల్లో కృష్ణారెడ్డికి ఓటు వేసి గెలిపించాలి. పది పన్నెండు ఎంపీలు గెలిస్తే తెలంగాణలో భూమి ఆకాశం ఒకటి చేసినంత పోరాటం చేస్తానని మనవి చేస్తున్నా. మీరు ఇచ్చే బలంతోనే కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పోరాటం చేయగలుగుతుంది. న్యాయం చేయగలగుతరు.. ఈ కాంగ్రెస్‌ మెడలు వంచగలుగుతరు. రైతులకు న్యాయం జరుగుతుంది. కరెంటు సక్కగ వస్తది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుతున్నా’నన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement