Saturday, April 27, 2024

రాష్ట్రంలో అందరికీ ఉచిత వైద్యం.. మాతా శిశు సంరక్షణలో తెలంగాణ నెం.1

పిల్లలను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్, మహబూబాబాద్ జిల్లో ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కావాలి అంటే పాడి పంటలతో పాటు..అందరికీ ఆరోగ్యం ఉన్నప్పుడే సాధ్యం అని సీఎం కేసిఆర్ ఆరోగ్యం పట్ల అత్యంత ఎక్కువ శ్రద్ద పెడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా తల్లీ, బిడ్డల ఆరోగ్యం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. బిడ్డ కడుపులో పడక ముందు నుంచి మనిషి చావు తర్వాత వరకు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

కెసిఅర్ కిట్ల పథకంతో గర్భిణిగా 6 నెలల నుంచి బాలింత అయిన మూడో నెల వరకు…ప్రతి నెల 2000 చొప్పున 6 నెలలకు 12 వేల రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు కష్టపడకూడదనేది సీఎం కేసిఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నట్లు వివరించారు. ఆరోగ్య లక్ష్మి వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటు తగ్గుదలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. మాతా శిశు సంరక్షణలోనూ, మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు. ఒకప్పుడు పోలియో ప్రపంచాన్ని వణికించిందన్న మంత్రి.. ఇప్పుడు దేశం, రాష్ట్రం పోలియో రహితంగా తయారు అయ్యిందన్నారు. ప్రజలు చైతన్యవంతమై, 5ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాని కోరారు.

రాష్ట్రంలో అందరికీ ఉచిత వైద్యం అందించాలనేది సీఎం కెసిఆర్ ఆలోచన అని చెప్పారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం కొనసాగుతున్నదన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అందరి ప్రొఫైల్ సిద్ధం చేస్తామన్నారు. ఈ సారి సీఎం కెసిఆర్ గారు విద్య, వైద్యం పై దృష్టి పెట్టారని చెప్పారు. మహబూబాబాద్, జనగామ లకు మెడికల్ కాలేజీలు ఇచ్చారన్నారు. అదేవిధంగా పేదలకు ఇబ్బంది లేకుండా అందరికీ ఆరోగ్యం అందించే కార్యక్రమాలు ఇంకా గణనీయంగా కొనసాగిస్తాం అని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement