Thursday, April 25, 2024

మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట : ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్ చెరు : మ‌త్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నీలి విప్లవం సృష్టించారని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మత్స్యకార సహకార సంఘం ప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే జీఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పాలనలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని, మత్స్యకారుల ప్రతి ఇంటా నేడు సంతోషాలు నెలకొన్నాయని అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో 38 మత్స్య సహకార సంఘాలు ఉండగా, 1752 మంది మత్స్యకారులు సభ్యత్వ నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మరో 4529 మత్స్యకారులు సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఈనెల 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సు లోపు గల అభ్యర్థులు, మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు హాజరై, సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 15 లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని అధికారులకు, సొసైటీ ప్రతినిధులకు ఎమ్మెల్యే ఆదేశించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతోపాటు, మత్స్య సంపదను పెంచేందుకు వీలుగా ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఉత్పత్తికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మార్కెటింగ్ సదుపాయాల సైతం కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మూలంగా ప్రతి మత్స్యకారులు ఆర్థికంగా అభ్యున్నతి సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో మత్స్యకార సోసైటీలకు శాశ్వత ప్రాతిపదికన పక్కా భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సభ్యత్వ నమోదు పూర్తయిన అనంతరం.. రాష్ట్ర పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా మంత్రి హరీష్ రావులతో కలిసి నియోజకవర్గ స్థాయిలో మత్స్యకారుల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మత్స్యశాఖ అధికారి సతీష్, సహకార సంఘం ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement