Tuesday, November 5, 2024

MDK: విద్యుద్ఘాతంతో.. ఆరు పాడి గేదెలు మృతి

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ గేదెలపై విద్యుత్ వైర్లు పడి మృతి చెందడం జరిగిందని రామాయపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామంలో గురువారం రాత్రి 11 గంటలకు 11 కెవి విద్యుత్ తీగ తెగిపడడంతో ఆరు పాడి పశువులు మృతిచెందాయి. గ్రామానికి చెందిన సల్ల నర్సింలుకు చెందిన నాలుగు గేదెలు ఒక దూడ, మంత్రి నాగులుకు చెందిన ఒక జెర్సీ ఆవు విద్యుత్ ఘాతంతో మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పారు.

శుక్రవారం ఉదయం సంఘటన స్థలానికి శాఖ లైవ్ టాక్ అసిస్టెంట్ ఫజల్, విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు, లైన్ మెన్ నాగయ్యలు చేరుకొని పరిశీలించారు. ఈసందర్భంగా విద్యుత్ శాఖ అధికారులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా శిథిలమైన తీగను మార్చలేదని, దీంతో తెగిపడి తీవ్ర నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు కొద్దిగానే పొలం ఉండడంతో పాడి పశువులను పెంచి పాలను విక్రయిస్తూ జీవనాధారం కొనసాగిస్తున్నారు. బాధితులకు విద్యుత్ శాఖ వారు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 11కెవి విద్యుత్ తీగ ఎల్ టి లైన్ పై పడటంతో తెగి పడడం వల్ల పలు ఇళ్లలో టీవీలు ఇతర విద్యుత్ పరికరాలు కాలిపోయినట్లుగా గ్రామస్తులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement