Friday, May 17, 2024

మట్టే ముద్దు.. రసాయనాలొద్దు ! నగరంలో ఆరు లక్షల మట్టి గణేష్‌ విగ్రహాల తయారీ

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ (ప్రతినిధి) : మట్టి గణేశ్‌ విగ్రహాలను తయారు చేయడం ఓక ఎత్తయితే.. వాటిని పంపిణీ చేయడం మరో ఎత్తు. భక్తులకు చేర్చడానికి గతంలో నగరానికి చెందిన ఓ స్వచ్చంధ సంస్థకు హెచ్‌ఎండీఏ 500 మట్టి గణేశ్‌ విగ్రహాలను అందించింది. అయితే ఆ స్వచ్ఛంద సంస్థ అందులో సగం వరకు మాత్రమే పంపిణీ చేయడంతో మిగతా సగం అలాగే ఉండి పోయాయి. వినాయక చవితి పండుగ తర్వాత ఆ విగ్రహాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఆరుబయట ఉండటంతో వర్షానికి తడిసి పాడై పోయాయి. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేటర్లు, ఇతర సంఘాలకు గత ఏడాది అందించిన గణపతి విగ్రహాలు భక్తులకు పంపిణీ చేసేలా మానిటరింగ్‌ చేయడంలో జీహెచ్‌ఎంసీతో పాటు హెచ్‌ఎండీఏ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులు విఫలమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ ఏడాది నగరంలో ఉచిత విగ్రహాల పంపిణీకి ఈ మూడు ప్రభుత్వ సంస్థలు మరోసారి సిద్ధమయ్యాయి. అయితే వీటి తయారీ, ప్రచారంలో చూపించిన చొరవ పంపిణీలో చూపించక పోవడంతో సగం విగ్రహాలు వృథా అవుతున్నాయని తెలుస్తోంది. గతం పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

6లక్షల విగ్రహాల తయారి..

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా నగరంలో మట్టి గణపతులను ఉచితంగా నగర వాసులకు పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో 4లక్షలు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆధ్వర్యంలో ఒక లక్ష, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో మరో లక్ష మొత్తం 6లక్షల విగ్రహాలను పంపిణి చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాయి. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌ ఇతర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను నవరాత్రుల తర్వాత హుస్సేన్‌ సాగర్‌ తో పాటు నగరంలోని పలు జలాశయాల్లో వేయడం వల్ల పొల్యూషన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉచిత మట్టి విగ్రహాల పంపిణి చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement