Friday, May 3, 2024

MBNR: వీరన్నపేటలో చిరుత సంచారం… అప్రమత్తంగా ఫారెస్ట్ అధికారుల సూచన

మహబూబ్ నగర్, క్రైమ్ జూన్ 30 (ప్రభ న్యూస్) : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట సమీపంలో గల కేటీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతంలో రాత్రి సమయంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గురువారం రాత్రి వీధుల వెంబడి తిరుగుతూ పెంపుడు శునకంపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. ఉదయం లేచి చూచిన స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. సమీపంలో అటవీ ప్రాంతం ఉండటంతో ఇటీవల తరచుగా చిరుత రాత్రి సమయంలో గట్టిగా అరుస్తూ భయాందోళనకు గురి చేస్తుందని, బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై స్థానికులు స్థానిక కౌన్సిలర్ కు సమాచారం అందించడంతో కౌన్సిలర్ సమాచారం మేరకు శుక్రవారం ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నిరంజన్ సిబ్బందితో చిరుత ఆనవాళ్లను గుర్తించారు.

కేటీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవి వైపు వెళ్లొద్దని, ముఖ్యంగా చిన్నపిల్లలను బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ అడవి ప్రాంతంలో సుమారు పదికి పైగా చిరుతపులులు సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఎవరైనా ప్రజలు అత్యవసరంగా అడవి వైపు వెళ్లాలి అనుకుంటే ఇద్దరు లేదా ముగ్గురు వెళ్లాలని ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. చిరుతపులి కూడా మనిషిలాగే తీవ్రంగా భయపడే జంతువని, ఒంటరిగా ఉన్న వారిపైన దాడి చేసింది తప్ప, మనుషులకు అది తీవ్రంగా భయపడుతుందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు బెంబేలెత్తి.. వెంటనే చర్యలు చేపట్టి, చిరుత పులులను బంధించాలని అధికారులను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement