Saturday, May 4, 2024

మహాత్మా పూలే మార్గంలో ప్రతిఒక్కరూ నడవాలి.. క‌లెక్ట‌ర్

మహబూబ్ నగర్: మహాత్మా జ్యోతిబాపూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే 197వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసిన వారు మహనీయులవుతారన్నారు. ఏప్రిల్ మాసంలో అనేక మంది మహనీయులు జన్మించారని, ఏప్రిల్ 5న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, 11న మహాత్మ జ్యోతిబాపూలే, 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నామన్నారు. వ్యక్తిగత జీవితాలను సమాజం కోసం త్యాగం చేసి నలుగురికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేసిన ప్రతి ఒక్కరూ మహనీయులుగా కీర్తించబడుతున్నారని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు.

సుమారు 100-150 సంవత్సరాలకు పూర్వం సమాజంలో అంటరానితనం, అవిద్య వంటి ఎన్నో సాంఘీక దురాచారాలను అప్పట్లోనే ఎదుర్కొని విద్య కోసం, ప్రత్యేకించి మహిళా విద్య, అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అన్నారు. మహాత్ముల జీవిత చరిత్రలను తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడిస్తే మన జీవితాలకు సంతృప్తి కలుగుతుందని, వారి జీవిత ఆశయాలను నెరవేర్చడంలో నలుగురికి సహాయపడే అవకాశం కలుగుతుందని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని, ఇందుకు ప్రతి ఉద్యోగి విధుల పట్ల పునరంకితమై నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు మాట్లాడుతూ.. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి ఇందిర, జిల్లా అధికారులు, ఆర్డీవో అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఐడిఓసి సిబ్బంది మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement