Saturday, May 4, 2024

మల్లన్న సాగర్‌ ట్రయల్‌ రన్ స‌క్సెస్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మల్లన్న సాగర్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును మంత్రులు హరీష్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌తో కలిసి ట్రైయల్‌ రన్‌ ప్రారంభించారు. నదీప్రవాహాలు, వాగుల జోరు లేని మైదాన ప్రాంతంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన మల్లన్న సాగర్‌ తెలంగాణ జలసిరిలో మకుటాయమానంగా నిలిచింది. ఇప్పటివరకు తెలంగాణలో అనేక రాజవంశాలు నిర్మించిన జలాశయాలే ఉన్నయి కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మైదాన ప్రాంతంలో నిర్మించిన భారీ జలాశయంగా మల్లన్న సాగర్‌ చరిత్రలో నిలిచిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌. ఉమ్మడి మెదక్‌, నల్లగొండ, నిజమాబాద్‌ బీడుభూమలను తడిపేందుకు జలధారాలు ఇక్కడి నుంచే పరుగులు పెడతాయి.

కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ గుండెకాయలాంటిది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కువనీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఎత్తయిన రిజర్వాయర్‌ మల్లన్నసార్‌. సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలం సరిహద్దులో దీనిని నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 8 గ్రామాలు, 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. ఈ రిజర్వార్‌ పూర్తి నీటి సామర్థ్యం 50 టీఎంసీలు. రిజర్వాయర్‌ చుట్టూ 22.60 కిలోమీటర్ల దూరం భారీ కట్టను నిర్మించారు.
మల్లన్న సాగర్‌ భూ నిర్వాసితులకు గజ్వేల్‌లో 600 ఎకరాల్లో 2,400 ఇళ్లతో సువిశాలమైన కాలనీ నిర్మించిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుంది. అలాగే నిర్వాసితులకు రూ.5 కోట్ల 4లక్షలు నగదు ఇచ్చారు. ఉపాధి కోసం రూ.7 కోట్ల 50 లక్షలు ఇచ్చిన చరిత్ర సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది.
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక్‌ సాగర్‌ నుంచి సొరంగ మార్గం నుంచి తుక్కాపూర్‌ పంప్‌ హౌస్‌కు గోదావరి జలాలు చేరుతాయి. అక్కడి నుంచి మల్లన్న సాగర్‌కు నీటిని ఎత్తిపోస్తారు. ఈ నీటితో 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. జలాశయానికి 5తూములు ఏర్పాటు చేశారు. ఈ 5 స్లూయిజ్‌ నుంచి కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి జలాశయానికి మిషన్‌ భగీరథకు నీరు అందనుంది.
ప్రస్తుతం నాలుగు జిల్లాలకు తాగునీరు అందించేందుకు ఈ ట్రైయల్‌ రన్‌ చేపట్టారు. రోజుకు 540 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి సరఫరా అవుతున్న 300 మిలియన్‌ లీటర్లకు మరో 300 మిలియన్‌ లీటర్లు తోడుకానున్నాయి. 1922 ఆవాసాలకు, 10 నియోజక వర్గాల్లోని 16 మున్సిపాలిటీలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందనుంది.
హైదరాబాద్‌ తాగునీటికి 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంససీలు ఈ జలాశయం నుంచే ప్రవహించనున్నాయి. ఈ ప్రాజెక్టు పుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌ 50 టీఎంససీలు కాగా కట్ట వెడల్పు 440 మీటర్లు, రిజర్వాయర్‌ పొడవు 22.4 కిలోమీటర్లు, డెడ్‌ స్టోరేజ్‌ నుంచి నీటిని తోడుకునే అవకాశం ఈ ప్రాజెక్టుకే సొంతం.

Advertisement

తాజా వార్తలు

Advertisement