Friday, May 10, 2024

ఓరుగల్లులో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..

వరంగల్ క్రైమ్, ఏప్రిల్ 11 (ప్రభ న్యూస్) : దేశవ్యాప్తంగా జోరుగా, ఉత్సాహంగా సాగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ లు ఊపందుకుంటున్నాయి. మ్యాచ్ ల ప్రారంభంకు ముందే బెట్టింగ్ దందాకు తెరలేపుతున్నారు. మ్యాచ్ లు, బ్యాట్స్ మెన్, బౌలర్ల పైనే కాక బాల్ బాల్ కు బెట్టింగ్స్ కాస్తున్నారు. సరిగ్గా ఇలాగే ఓరుగల్లు నగర శివారులో ముగ్గురు సభ్యుల ముఠా గుట్టుగా, క్రికెట్ బెట్టింగ్స్ కాస్తూ అక్రమ దందాకు తెర లేపారు. ఈ విషయంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ డాక్టర్ ఎం.జితేందర్ రెడ్డి సారథ్యంలో మెరుపు దాడి చేసి, చట్టవిరుద్ధంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ భాగోతాన్ని బట్టబయలు చేశారు.

కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారంకు చెందిన ఆటో డ్రైవర్ లవుడ్య రాజేందర్ ఇంటిపై దాడి చేసి క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంను బహిర్గత పరిచారు. డైమండ్ ఎక్స్ సి హెచ్9 పోర్టల్ అండ్ స్ప్రింటర్స్ బుక్ లో బెట్టింగ్ కాసిన 68 వేల నగదు, 3 మొబైల్ ఫోన్స్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. లవుడ్య రాజేందర్, హన్మకొండ గుండ్ల సింగారంకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ కొర్ర.ప్రమోద్ (29), హన్మకొండ, వాజ్ పాయ్ కాలనీకి చెందిన సయ్యద్ అంకుస్ (35) లను అరెస్ట్ చేశారు. ఇంకా అదాలత్, చోట మసీద్ కు చెందిన హోటల్ వ్యాపారి నునావత్ తిరుపతి (30), హాసన్ పర్తికి చెందిన చిత్తరి కోటిలింగం లు పరారీలో ఉన్నారు. తదుపరి చర్యల కోసమై కేయు పోలీసులకు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ కె.శ్రీనివాస రావు, ఎసై లు లవన్ కుమార్, ఎండి.నిస్సార్ పాషా, బి.శరత్ ల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement