Monday, April 29, 2024

లిక్కర్​తోనే స‌ర్వ‌నాశ‌నం, సవాల్‌ విసురుతున్న అత్యాచార సమస్య.. అఖిలపక్ష భేటీలో లీడ‌ర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మద్యం కారణంతోనే నేరాలు, ఘోరాలు పెరిగిన తెలంగాణ నాశనం అయిపోతుందని అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో నడుస్తోన్న పబ్‌లు, క్లబ్‌ల సంస్కృతి మహిళలు, బాలికలపై అత్యాచారాలకు దారి తీస్తుందని వారు అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలోనిమహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసులపై రాజకీయ ప్రభావం అనే అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనిలో టిజెఎస్‌ అధినేత కోదండ రామ్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఫిరోజ్‌ ఖాన్‌, ప్రజా సంఘాల నేతలు విమలక్క, తీన్మామర్‌ మల్లన్న, పివోడబ్ల్యూ సంథ్య తదితరులు పాల్గొన్నారు.

సినిమాల ప్రభావం, విదేశీ సంస్కృతి, ఆర్థిక పరిస్థితులు వంటి కారణాలతో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని వారు తెలిపారు. దేశంలోనూ, తెలంగాణలోనూ 90 శాతం అత్యాచారాలు దళిత, బలహీన వర్గాలపైనే జరుగుతున్నాయనే అంశాన్ని గమనించాలన్నారు. తెలంగాణలో అత్యాచార సమస్య సవాల్‌ విసురుతుందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని వారు డిమాండ్‌ చేశారు. అత్యాచారం చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారనే అంశంపై పట్టణాలు, గ్రామాలలో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మద్యపానం నిషేదం, డ్రగ్స్‌, పబ్‌ల నియంత్రణ కోసం అఖిల పక్షాలన్నీ కలిసి ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. మద్యం సేవించే వారికి ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇవ్వకూడదనే నియమాన్ని రాజకీయ పార్టీలన్నీ పాటించాలని వక్తలు డిమాండ్‌ చేశారు. అందరికంటే ముందు రాజకీయ నేతలు మద్యం సేవించడం మానివేసి, రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదాన్ని అమలు చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement