Thursday, April 25, 2024

KTR – కాంగ్రెస్ ది గంగిరెద్దుల జాత‌రే … వినిమోస‌పోవ‌ద్దు

ములుగు – త్వరలో 17వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ దశాబ్ధి వేడుకల్లో భాగంగా ములుగులో సాగునీటి దినోత్సవ సభలో పాల్గొన్న‌ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నాడు దాశరథి జైల్ గోడలమీద రాశార‌ని, . నేడు కేసీఆర్ తెలంగాణ కోటిరత్నాల వీణనేకాదు.. కోటిన్నర ఎకరాల మాగాణి అని నిరూపించారని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మండు వేసవిలో ఏనాడైనా నీళ్ళు కనిపించాయా? తాగునీరు ఇవ్వక చావగొట్టి, సాగునీరు ఇవ్వకుండా సతాయించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతారు అంటూ కేటీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్ పై మాట‌ల దాడి..

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనరు. పెట్టుబడి ఇవ్వరు. కానీ, ఇక్కడ ప్రజల్ని ఆగంచేసేలా డైలాగులు చెబుతారు. ఎన్నో ఏళ్ళుగా గిరిజనులు ఎదురు చూసిన 3,100 తండాలను గ్రామ పంచాయతీలుగా కేసీఆర్ మార్చారు. ములుగులో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ప్రజలు మనవాళ్లని కేసీఆర్ నలుగురు మంత్రులను పంపించి పలు అభివృద్ధి పనులు ప్రారంభింపజేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ములుగు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ములుగును మున్సిపాలిటీగా మార్చామని, కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు 133కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని కేటీఆర్ చెప్పారు.

దళితులకు, గిరిజనులకు, యాదవులకు మహిళా సంఘాలకు 110 కోట్ల ఆస్తులు పంపిణీ చేస్తున్నామని, 17వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణవస్తే ఏం వచ్చిందని ప్రశ్నించే వారికి జాతీయ స్థాయిలో ములుగు రెండో స్థానం సాధించిన ఘనత చాలదా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. వడ్లు కొనే తెలివిలేనోళ్ళు, చేతగాని దద్దమ్మలు, దిక్కుమాలిన కాంగ్రెస్ నాయకులు డైలాగ్‌లు చెబితే మోసపోతామా? మోసపోయి గోస పడుతామా..? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా హామీ ఇవ్వని పనులెన్నో చేసిన కేసీఆర్‌కు రుణపడి ఉందామా? ఆలోచించండి అంటూ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.

- Advertisement -

ములుగు జిల్లాలో లక్షా 65వేల మంది హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేశాం. వచ్చే ఏడాది నుంచి పనిచేసే మెడికల్ కాలేజీలో వైద్య సేవలు అందించడం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. 60ఏళ్లలో చేయని పనులను ఎనిమిదేళ్లలో కేసీఆర్ చేసి చూపించారని, వారి రుణం తీర్చుకునేలా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ స్థానిక ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మహ్మమూద్ అలి, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement