Sunday, April 28, 2024

పట్టణాలకు దీటుగా పల్లెల్లో అభివృద్ధి.. చివరిరోజు పల్లె ప్రగతిలో మంత్రి పువ్వాడ..

ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ప్రభన్యూస్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో గొప్ప విజన్‌తో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారని, పల్లె ప్రగతితో పట్టణాలకు ధీటుగా నేడు పల్లెలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. 5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా చివరిరోజు శనివారం ఖమ్మం జిల్లాలోని రఘునాధపాలెం మండలంలో మంత్రి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లె ప్రగతితో రాష్ట్రంలో అంతటా, గ్రామాలు, తండాలు, పల్లెలు శరవేగంగా అభివృద్ధి చెందాయని అన్నారు. రఘునాధపాలెం మండలం చెరువుకొమ్ముతండా, వేపకుంట్ల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. చెరువుకొమ్ము తండా గ్రామంలో రూ.17 లక్షలతో నిర్మించిన సైడ్‌ కాల్వలు, సీసీ రోడ్లు, వేపకుంట్ల గ్రామంలో రూ.54.50 లక్షలతో నిర్మించిన సైడ్‌ కాల్వలు, సీసీ రోడ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా వేపకుంట్ల గ్రామంలో జరిగిన గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 3 నుండి 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్టణ కార్యక్రమం చేపట్టి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేసినట్లు, అందరం కలిసి కట్టుగా సమస్యల పరిష్కారం చేసుకున్నట్లు తెలిపారు. వర్షాకాలం వస్తున్నందున వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వీధులు, కాల్వలు శుభ్రం చేసుకొని పిచ్చి మొక్కలు, చెత్త తొలగించుకొని వర్షాకాలం జాగ్రత్తలపై సన్నద్ధం కావడానికి ప్రణాళికలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం జరిగిందన్నారు. తాను మంత్రి అయిన తర్వాత కేవలం ఒక్క వేపకుంట్ల గ్రామంలోనే సీసీ రోడ్లకు రూ.1.10 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలకు ధీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని, పట్టణాల్లో అనేక సమస్యలకు పరిష్కారం జరుగుతూ వేగంగా అభివృద్ధి జరుగుతోందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. గ్రామాల్లో ఏ మాత్రం ఇంకా సీసీ రోడ్ల నిర్మాణం మిగిలున్నా పూర్తి చేస్తామన్నారు. ఈజీఎస్‌, ఎమ్మెల్యే, సుడా నిధులతో రఘునాధపాలెం మండలంలో దాదాపు రూ.12 కోట్ల సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో నిర్మాణం చేసుకున్నామన్నారు. మండలంలో ఎక్కడైనా సీసీ రోడ్ల ఆవశ్యకత ఉంటే పూర్తి చేస్తామని, సీసీ రోడ్ల పూర్తితో బురద, అపరిశుభ్రత వాతావరణం ఉండదని, డెంగ్యూ, చికెన్‌ గున్యా, మలేరియా రావని, వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఉంటుందని, రోడ్లను ఊడ్చుకుని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

శరవేగ అభివృద్ధితో భూములు బంగారం అయ్యాయని, సంపద విలువ పెరుగుతుందని, వ్యవసాయం మనకు ఆధారమని, భూములను నమ్ముకోండి కానీ అమ్ముకోకండని పేర్కొన్నారు. 17 గ్రామ పంచాయతీలు ఉన్న రఘునాథపాలెం మండలాన్ని 37 గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని, చిన్న తండాలు కూడా పురోగమించి ప్రతి తండా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నట్లు, కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణానికి ఒక్కొక్క భవనానికి రూ. 25 లక్షల చొప్పున మంజూరు అయిందన్నారు. అదేవిధంగా రైతు బంధు, రైతు భీమా, కళ్యాణలక్ష్మీ, ఆసరా పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలు కరోనా సందర్భంలో ఆర్థికంగా ఎంత ఇబ్బంది తలెత్తినా ఆపకుండా అందజేయడం జరిగిందన్నారు. జూలై నుండి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని, గ్రామంలో ట్యాంక్‌ బండ్‌ ఏర్పాటుకు రూ.25 లక్షలు మంజూరు చేశామని, పూర్తి కావడానికి అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందజేస్తామన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమం ప్రత్యేక కార్యాచరణతో చేపట్టినట్లు తెలిపారు. పారిశుద్ధ్య సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారించామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీ ప్రసన్న, డీఆర్డీవో విద్యాచందన, డీపీవో హరిప్రసాద్‌, ఈఈ పీఆర్‌ శ్రీనివాస్‌, రఘునాథపాలెం ఎంపీడీవో రామకృష్ణ, తహశీల్దార్‌ నర్సింహారావు, డీఎల్పీవో పుల్లారావు, జడ్పీటీసీ ప్రియాంక, సర్పంచ్‌లు దారాశ్యాం, మంగమ్మ, ఎంపీటీసీ వనజారాణి, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement