Monday, May 6, 2024

ఆదివాసీలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి – ఎంపీ సోయం బాబూరావు

:దుమ్ముగూడెం మండలం చింతగుప్ప ఆదివాసీలు గత 30 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న 60 ఎకరాల పోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని ఆదిలాబాద్ ఎంపీ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు సోయం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీలతో చింతగుప్ప గ్రామ పరిధిలోని 60 ఎకరాల పోడుభూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాలు ఇస్తానని పలుమార్లు హామీ ఇచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత మర్చిపోయారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని మాత్రమే మేము అడుగుతున్నామని మేమేమి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఆయాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ఆదివాసీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, వివిధ హోదాల్లో పని చేస్తున్న ప్రజా ప్రతినిధులు ఒక తాటిపైకి వచ్చి ఆదివాసీల ముఖ్య సమస్యలు అయినటువంటి పోడు భూములకు పట్టాలు, జీవో నెంబర్ 3, 1 ఆఫ్70 చట్టం తదితర సమస్యలపై ఐక్యంగా పోరాడాలని ఆదివాసీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. చింతగుప్ప ఆదివాసి ప్రజలకు న్యాయం చేయకపోతే మే నెలలో చింతగుప్ప నుండే రాష్ట్రవ్యాప్త పోడు భూముల భరోసా యాత్రను ప్రారంభించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు ఆదివాసీ మహిళలు, రైతులు గత ఆరు తరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకుందామని ప్రయత్నిస్తున్నారని ఎంపీ బాబురావు గారి ముందు మొరపెట్టుకున్నారు. కాగా అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన చింతగుప్పలో బీజేపీ ఎంపీ పర్యటించడం పట్ల పలువురు ఆదివాసీ యువత, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తొమ్మిది తెగల ఆదివాసీల సమన్వయకర్త చుంచు రామకృష్ణ, ఏఈడబ్ల్యూసిఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడియం బాలరాజు, రిటైర్డ్ డి.ఎస్.పి కుంజ సీతారాములు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కల్తి వీరమల్లు, పోలీస్ స్టేషన్లో ఉన్న ఆదివాసీలను విడిపించడానికి స్వతహాగా పూచీకత్తు ఇవ్వడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు రేసు శ్రీను, వర్స వసంతరావు, గురుకుల ఉపాధ్యాయులు మోడెం కాశయ్య, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడెం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు దొర, నాయకులు ముక్తి రాజు, స్థానిక సర్పంచ్ కట్టం కృష్ణ, మహిళలు యువత రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement