Thursday, May 16, 2024

కెసిఆర్ మౌనం వెన‌క ఎన్నిక‌ల వ్యూహం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఆయన మౌనంగా ఉంటే.. తెరవెనక ఏదో జరుగుతోందని విపక్షాలకు గుండె దడ. ప్రజలను ప్రభావితం చేసే ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా రాజకీయ వ్యూహంతో అనుకూలంగా మార్చుకునే శక్తియుక్తులు ఆయనకే సొంతం. గడిచిన దశాబ్ధ కాలంలో అవి నిరూపితమైనవి కూడా. నలభై యేళ్ళ ప్రజా జీవితం.. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ప్రావీణ్యం.. గ్రామీణ ప్రజల నాడి ఇట్టే పసిగట్టే మేధో సంపత్తి.. క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన నేతగా కలుపుగోరుతనం.. అన్నింటికీ మించి రెండు దశాబ్ధాలు దాటిన ఉద్యమ అనుభవం.. ఇవన్నీ బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విజయ రహస్యాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఏ వ్యూహంతో ముందడుగు వేస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తామో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజల చిరకాల ఆకాంక్షలు నెరవేరుతాయో.. ఊహించి, వాటిని కార్యరూపంలోకి తెచ్చి ఘనతను సాధించి చూపారాయన.

రెండు పర్యాయాలు రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చి ఉద్యమ స్పూర్తిని జాతీయ స్థాయికి చాటే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదే సమయంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో పార్టీ యంత్రాంగానికి ధైర్యం నూరిపోసి ముందుకు నడిపిస్తున్న కేసీఆర్‌ తదనంతర వ్యూహంపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్‌ అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ.. బీఆర్‌ఎస్‌పై బురదజల్లుతుంటే, కేసీఆర్‌ మౌనంగా ఎందుకున్నారో తెలియక తలలు పండిన రాజకీయ నాయకులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. నిజానికి గత కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మక ఎన్నికల ప్రణాళికలో నిమగ్నమై ఉన్నారు. విపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. మరోసారి హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించి తన సత్తా ఏమిటో దేశానికి చాటి చెప్పాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఈ క్రమంలో తనతో నమ్మకంగా ఉండే కొంతమంది మేధావులతో క్రమంగా చర్యలు జరుపుతూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కొన్ని సంఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజల్లో, ముఖ్యంగా యువకుల్లో ఉన్న వ్యతిరేక పవనాలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో మూడోసారి విజయకేతనం ఎగురవేసి సమకాలీన రాజకీయాల్లో కేసీఆర్‌ అంటే ఏమిటో నిరూపించుకోవాలన్న తపనతో, పట్టుదలతో కార్యాచరణ ప్రణాళికను రచిస్తున్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో సంక్షేమ మంత్రం జపిస్తూ ముందుకు సాగారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. అవే పథకాలు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశాయి. ప్రస్తుతం మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో గెలవడం ద్వారా దాని ప్రభావం జాతీయ రాజకీయాలపై కూడా ఉంటు-ందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో గెలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరుగుండదని భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల్లో బీఆర్‌ఎస్‌ పాలనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు, ప్రతిపక్షాలను ఎన్నికల్లో చిత్తు చేసేందుకు సరికొత్త సంక్షేమ వ్యూహం రచిస్తున్నారు.

ఉద్యమ సారథిగా 2014లో తొలి విజయం సాధించి ఘనతకెక్కారు. తెలంగాణ ఉద్యమ సారథిగా కేసీఆర్‌ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది తామే అని ఆ ఎన్నికల్లో ప్రచారం చేసింది. కానీ తెలంగాణ తెచ్చింది తానేనని కేసీఆర్‌, టీ-ఆర్‌ఎస్‌ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. 2018లో మలివిడత ఎన్నికల్లో ప్రతిష్టాత్మక రైతుబంధు పథకం గట్టెక్కించింది. ఐదేళ్ల పాలన పూర్తి చేయకుండానే కేసీఆర్‌ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికలకు ముందే.. రైతుబంధు పథకం ప్రారంభించారు. భూమి ఉన్న ప్రతీ రైతుకు పెట్టు-బడి సాయంగా ఎకరాకు రూ.4000 అందించారు. అదనంతరం ఆ మొత్తాన్ని రూ.5000లకు పెంచారు. అయితే, విపక్షాలు ఇది ఎన్నికల స్టంట్‌ అని ప్రచారం చేసింది. ఇక ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే తాను ప్రారంభించిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రచారం చేశారు. రైతు బీమా కూడా ఇస్తామని ప్రకటించారు. పింఛన్లు రూ.2వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని, డబుల బెడ్రూం ఇవ్వని వారికి సొంత జాగా ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇదు సమయంలో చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ- చేయడంతో ఆంధ్రుల పాలన మనకు మళ్లీ అవసరమా అన్న ప్రచారం విస్తృతం చేశారు. దీంతో ఆంధ్రులు వస్తే మళ్లీ తెలంగాణ ఆగమైతుందని నమ్మి, కేసీఆర్‌ ఈసారైనా మాట నిలుపుకుంటాడని భావించి ప్రజలు మరోమారు అధికారం కట్టబెట్టారు. అత్యధికంగా 83 అసెంబ్లిd స్థానాలు సాధించి సత్తా చాటారు. ఇకటి, అరా మినహా.. ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement