Saturday, April 27, 2024

KNR: క్రీడా పోటీల్లో విద్యార్థులు రాణించాలి… అదనపు కలెక్టర్

రామగుండం, మార్చి 26 (ప్రభ న్యూస్) : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. మంగళవారం రామగుండంలోని ఎం.జి. స్టేడియంలో ఎన్టిపిసి సిఎస్ఆర్ సి.డి ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ విద్యార్థినీ, విద్యార్థులకు ఏర్పాటు చేసిన గ్రామీణ ఆటల పోటీలను ఎన్.టి.పి.సి (ఆర్&టి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండుతో కలిసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ… క్రీడలపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించడం వలన అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు. విద్యతో పాటు క్రీడలపై సైతం విద్యార్థులు శ్రద్ధ వహించాలని, ప్రతిరోజూ కొంత సమయం క్రీడలకు కేటాయిస్తే మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. విద్యార్థుల క్రీడాభివృద్ధికి జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తూ అండగా ఉంటుందన్నారు. ఎన్.టి.పి.సి సి.ఎస్.ఆర్ క్రింద అనేక కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తుందన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థినీ, విద్యార్థులకు ట్రాక్ సూట్స్, భోజన సదుపాయం కల్పించడం జరిగిందన్నారు.


ఎన్.టి.పి.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు మాట్లాడుతూ… ఎన్టిపిసి సిఎస్ఆర్ ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, ముఖ్యంగా విద్య, వైద్యం, ప్రాథమిక సౌకర్యాల కల్పన, ఒకేషనల్ ట్రైనింగ్, కళలు, నీరు, శానిటేషన్ పై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. గ్రామీణ క్రీడా పోటీల్లో 20పాఠశాలల నుంచి సుమారు 800 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొంటున్నారని, నిరంతరం వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు ఉత్సాహవంతంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ కుమార స్వామి, రామగుండం మండల విద్యాశాఖ అధికారి సంపత్ రావు, ఎన్టిపిసి జనరల్ మేనేజర్ ప్రశాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement