Saturday, April 27, 2024

మహిళల భద్రత, రక్షణలో షీటీంల కీలకపాత్ర : సీపీ సుబ్బారాయుడు

మహిళల రక్షణ విషయంలో షిటీంలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు అన్నారు. మహిళలు, విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలను పోలీస్ శాఖలోని షీటీంల దృష్టికి తీసుకురావాలన్నారు.
కరీంనగర్ కమీషనరేట్ లోని షీటీంలో పనిచేస్తున్న వివిధ స్థాయిలకు చెందిన పోలీసులకు నగదు రివార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కమీషనరేట్ లోని షీటీం పోలీసులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారన్నారు. విద్యార్థినులు, మహిళలు ఏ ఆపద వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా షీటీం వాట్సాప్ నెంబర్ 87126 70759 కు టెక్స్ట్ ద్వారా లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించినా సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ నెంబర్ ను విద్యార్థినులు, మహిళలు భద్రంగా దాచుకోవాలన్నారు.

నాలుగు గోడల మధ్య ఎదుర్కొనే వివిధ రకాల వేధింపులు లేదా అల్లరిమూకల ఆగడాలపై సమాచారం అందించాలన్నారు. మహిళలు విద్యార్థినుల పేర్లను గోప్యంగా ఉంచుతూ వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. మహిళల రక్షణ, భద్రతలను కల్పించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. షీటీంలకు చెందిన పోలీసులు మఫ్టీలో సంచరిస్తూ కంటికి కనిపించని అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తూ పోకిరీల ఆగడాలను వీడియో, ఫోటోల రూపంలో నిక్షిప్తం చేస్తున్నారని, ఈ ఆధారాలు న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా ప్రవేశపెట్టి పోకిరీలకు శిక్షలు విధించడేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు పాలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి శ్రీనివాస్, ఏసిపిలు విజయకుమార్, ప్రతాప్ మహిళ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్ట‌ర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement