Saturday, April 27, 2024

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

కరీంనగర్ : జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆస్తి,ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్ ఇంజనీర్లు, మెడికల్ అండ్ హెల్త్ శాఖ వైద్యులు, ఎంపీడీవోలు లతో భారీ వర్షాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల చెరువులు కుంటలు తెగిపోయే అవకాశం ఉన్నందున ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.

చెరువులో గండి పడితే వెంటనే తగుచర్యలు తీసుకోవాలని ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచుకోవాలని, ఏఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎస్ఈ ఇరిగేషన్ ను కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాప్తి చెందకుండా నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. వైద్యాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రిలో మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్సీ ఎస్టీ బిసి, కేజీబీవీ వసతి గృహలను సందర్శించి పిల్లలు ఆరోగ్యం బారినపడకుండా చూడాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎవరికి కూడా సెలవు ఇవ్వకూడదని సెలవులో ఉన్న వారి సెలవు రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, ఇరిగేషన్ శాఖ ఈఈ నాగభూషణం, జిల్లా ఇరిగేషన్ అధికారి అస్మత్ అలీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జూవేరియా, డి ఆర్ డి ఎ శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ శాఖ, ఆర్అండ్ బిఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement