Wednesday, May 1, 2024

కరోనా భయం..ప్రభుత్వాస్పత్రిలో జనం

ఓదెల: రాష్ట్రంలో కరోనావ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జనం సందడి చేస్తున్నారు. గత వారం రోజుల నుండి ఆరోగ్య ప్రాథమిక కేంద్రాల జనంతో నిండిపోతోంది. మండలంలోని కొలనూరు, ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిత్యం జనం పెద్ద సంఖ్యలో వస్తుండగా ముందుగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరమే టీకాలను వేస్తున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది సేవలందించడంలో నిమగ్నమవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ లావణ్య ఆధ్వర్యంలో వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. గ్రామస్థాయిలో ఆశ కార్యకర్త నుండి మొదలుకొని ఆరోగ్య ఉద్యోగ బృందాలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆసుపత్రికి తీసుకు వస్తున్నారు. రోజురోజుకు వ్యాధి తీవ్ర పెరగడంతో ప్రజల్లో భయం నెలకొంది. దీంతో ప్రజాప్రతినిధులతోపాటు అధికార యంత్రాంగం సైతం టీకాలు వేసుకునే వారికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించి కరోనా దూరం అవుతుందనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. అలాగే కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సైతం ఆరోగ్య సిబ్బంది నిత్యం నిరంతరం శ్రమిస్తున్నారు. వ్యాధిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని గ్రామాల్లో ప్రచారాన్ని సాగిస్తున్నారు. పలు గ్రామాల నుండి ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది దగ్గరుండి ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement