Sunday, April 28, 2024

Kamareddy – రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

కామారెడ్డి, జూన్ 28 (ప్రభ న్యూస్):- ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ పారదర్శక ఓటరు జాబితా తయారీలో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కామారెడ్డి ఈవీఎం గోదాంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది శాసన సభ ఎన్నికల నిర్వహించాల్సి ఉన్నందు వల్ల రెండో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌- 2023 పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా మరో షెడ్యూల్‌ను ప్రకటించిందన్నారు. అక్టోబర్ 1 వరకు2023 నాటికి 18 ఏళ్ల నిండిన యువతి, యువకుల పేర్లు ఈనెల 30లోగా ఫామ్ 6లో బిఎల్వలకు అందజేయాలని తెలిపారు. అక్టోబర్‌ 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగియనుందన్నారు. ఇంటింటా సర్వేతోపాటు అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయడం, డబుల్‌ ఓటర్లు, చనిపోయిన వారి తొలగింపునకు దరఖాస్తులను స్వీకరించి సవరణలు చేసి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు.


ఒకే రకమైన ఫొటోలు, మరణించిన వారు, ఒకే ఓటరు వేర్వేరు చోట్ల నమోదు వంటి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అన్నారు. అనంతరం ఈవీఎంలు, వివి ప్యాట్స్ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఫస్ట్ లెవెల్ తనిఖీలను రాజకీయ పార్టీ నాయకులతో నిర్వహించారు. బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్స్ పనిచేయు విధానాన్ని పరిశీలించారు. రాజకీయ పార్టీల నాయకుల సందేహాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఈసీఐఎల్ ఇంజనీర్స్ నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ వెంకట్ రావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement