Saturday, April 27, 2024

TS | ఇండియా కూట‌మిలో చేర‌మ‌న్నా… కెసిఆర్ విన‌లేదు : కేకే

హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు… బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు రాజ్యసభ ఎంపీ కే కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్‌ఎస్ వీడీ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కె.కేశరావు మీడియాతో మాట్లాడుతూ.. తాను 55 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, కాంగ్రెస్ నుంచి నాలుగు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నానని పేర్కొన్నారు.

తనను సీడబ్ల్యూసీ సభ్యుడిగా చేసింది కాంగ్రెస్సేనని అన్నారు. మొదటగా 1998లో తెలంగాణ కోసం 40 మంది ఎమ్మెల్యేలతో సోనియాగాంధీ కి తెలంగాణ కోసం లెటర్ ఇచ్చామన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలుగా ఎంతగానో పోరాడారని, తెలంగాణ ఉద్యమం ప్రజల్లో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరాలనే ప్రతిపాదన వచ్చింద‌ని కె.కేశవరావు అన్నారు . 55 ఏళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరానని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలంటే ఎక్కువ మంది ఎంపీలు అవసరమన్నారు. కొన్ని కారణాల వల్ల ఆ రోజు బీఆర్‌ఎస్‌కు వెళ్లినట్లు తెలిపారు.

అయితే.. నిన్న కేసీఆర్‌‌ను కలిశానని, మీరు పార్టీ ని విడిచి పోవద్దు అన్నారని, తీర్థయాత్ర ముగిసింది అనుకుంటున్నానని, ఇప్పుడు నా సొంత పార్టీకి వస్తున్నానన్నారు. ఈ పార్టీలోనే నా తుది శ్వాస వరకు ఉంటానని, బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అని కేసీఆర్ నా ముందే సోనియాగాంధీ కి చెప్పారని, కానీ ఆయన విలీనం చేయలేదన్నారు. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 64 సార్లు రాజ్యసభ సమావేశాలకు వెళ్ళానని, బీఆర్‌ఎస్‌ నుంచి 16 సార్లు మాత్రమే వెళ్ళానని, కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోకి వెళ్లాలని కేసీఆర్‌‌కు చెప్పానని, కానీ కేసీఆర్ మాత్రం త‌న‌ మాట వినలేదన్నారు.

రేపు త‌న కుమార్తె విజయ లక్ష్మి కాంగ్రెస్‌లో జాయిన్ అవుతుందని, నేను ఢిల్లీ నాయకులతో చర్చించిన తర్వాత జాయినింగ్ డేట్‌ చెప్తానన్నారు. త‌న‌కు పార్టీ మారడంపై విప్ ఇస్తే అందుకు సమాధానం చెబుతానని అంటూ త‌న‌కు కేసీఆర్ రాజ్యసభ మాత్రమే ఇచ్చారన్నారు. మొదటిసారి రాజ్యసభ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వేసిన రెండవ ప్రాధాన్యత వోటు తోనే గెలిచానని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement