Saturday, May 4, 2024

ఈ బస్సు ఎక్కితే గొడుగు కావాల్సిందే..! ప్రయాణికులకు తప్పని పల్లెవెలుగు కష్టాలు

షాద్ నగర్, ప్రభ న్యూస్, జూలై 20 : రాను రాను రాజుగుర్రం ఏదో అయిన చందంగా తయారైంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీరు. పేద మద్య తరగతి ప్రజలకు రవాణా రంగంలో ఎంతో కాలంగా చేదోడుగా ఉంటూ ఆర్టీసీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ ఖర్చుతో గమ్యస్థానం చేర్చుతూ సామాన్య ప్రజానీకానికి చేరువైన ఆర్టీసీ ప్రస్తుతం సరైన నిర్వహణ లేక అబాసు పాలవుతూనే ఉంది. ఇది ఎంతలా అంటే కొన్ని దృశ్యాలు చూస్తే నవ్వుకోవడమే మన వంతవుతుందంటే ఆశ్చర్యార్థకమేమీ కాదు.

వర్షాకాలం ప్రారంభమైందంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంత ఆషామాషీ కాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ డిపో బస్సుల నిర్వహణ లోపం కారణంగా ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. గురువారం ఉదయం 10:30 నిమిషాలకు షాద్ నగర్ నుండి హైదరాబాద్ బయలుదేరిన (ఎపీ28జెడ్6083) పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన వారి పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనకమానరు. వర్షాలు కురుస్తుండటంతో బస్సులో ప్రయాణం చేసిన కాసేపైనా వానకు తడవకుండా ఉంటామని భావించిన ప్రయాణికులకు బస్సులో ఉన్నా వర్షం బాధ తప్ప లేదని చెప్పవచ్చు.

- Advertisement -

పల్లె వెలుగు బస్సుల నిర్వహణ సరిగా లేకపోవడంతో వానకు బస్సు పూర్తిగా కురిసింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న గొడుగులను తెరచి సీట్లలో కూర్చోవడం చూసిన వారికి వింతగా కనిపించింది. ప్రజా రోడ్డు రవాణా వ్యవస్థ పై అధికారులకు ఎందుకింత అలుసు అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే టికెట్ ధరలను పెంచిన ఆర్టీసీ ప్రజల సౌకర్యాలు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement