Sunday, April 28, 2024

TS: బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్‌లో హైడ్రామా…కోర్టు తీర్పుతో అవిశ్వాసం వాయిదా…

మణికొండ , ఫిబ్రవరి 16(ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లో శుక్రవారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మేయర్ పై గత నెలలోనే అవిశ్వాసం తీర్మానం ఇచ్చి క్యాంపునకు వెళ్లిపోయిన మెజారిటీ అసమ్మతి కార్పొరేటర్లు ఒకవైపు.. మేయర్ అనుకూల మైనారిటీ కార్పొరేటర్లు ఒకవైపు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది.

- Advertisement -

వాస్తవానికి కార్పొరేషన్ లో శుక్రవారం అవిశ్వాసంపై ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ సమయం కోసమే నెల రోజులకు పైగా సమయం నుంచి అసమ్మతి కార్పొరేటర్లు 16 మంది క్యాంపులో ఉండడం గమనార్హం. వీరంతా ఓటింగ్ ఉందనుకుని శుక్రవారం కార్పొరేసన్ కు వచ్చారు. అయితే, కోర్టు స్టే ఇచ్చిందని తెలిసి నిరాశకు గురయ్యారు. మరోవైపు న్యాయస్థానం స్టే కారణంగా ఓటింగ్ వాయిదా పడింది. అయితే, ఇది తమ విజయమే అంటూ మేయర్ వర్గం కార్పొరేటర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వ్యవహారం మరో మలుపు తీసుకుంది.

మాదే గెలుపు.. కాదు మాదే
ఓటింగ్ జరగకపోవడాన్ని మేయర్ వర్గం తమ విజయంగా పేర్కొంటోంది. జాగీర్ లో ఉన్నది 21 మంది కార్పొరేటర్లు. వీరిలో 16 మంది అసమ్మతి వర్గమే. మిగిలిన ఐదుగురు మేయర్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ఎంతో పట్టుదలగా సాగిన అవిశ్వాసం వ్యవహారం చివరకు వాయిదా పర్వానికి దారితీయడమే ఇక్కడ మలుపు. ఆ పరిణామాన్నే మేయర్ వర్గం తమ విజయంగా గొప్పగా చెబుతోంది. ఈ మేరకు తామే గెలిచామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అయితే, అసమ్మతి కార్పొరేటర్లు మాత్రం దీనిని ఎద్దేవా చేస్తున్నారు. సంఖ్యా బలం రీత్యానే కాదు, నైతికంగానూ తమదే విజయమని పేర్కొంటోంది. వీరంతా ఒక అడుగు ముందుకేసి ఏకంగా బాణసంచా కూడా కాల్చడం గమనార్హం.

ఎట్టకేలకు క్యాంపు వీడి..
మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి దాదాపు 34 రోజుల కిందటనే క్యాంపులోకి వెళ్లిపోయారు ఆయనను వ్యతిరేకిస్తున్న కార్పొరేటర్లు. ఇన్ని రోజులూ క్యాంపులోనే ఉంటూ వచ్చారు. ఎన్ని ప్రలోభాలు, ప్రయత్నాలు చేసినా వీరు పట్టు సడలించలేదు. అయితే, శుక్రవారం ఓటింగ్ ఉండడంతో బయటకు వచ్చారు. తీరా అదికాస్త నిలిచిపోవడంతో ఏం చేస్తారో చూడాల్సి ఉంది. మొత్తానికి ఇరు వర్గాల మధ్య సాగిన హైడ్రామా అందరికీ ఆసక్తి కలిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement