Sunday, May 16, 2021

కార్ఖానాల‌కు సెకండ్ వేవ్ సెగ‌…

హైదరాబాద్‌, : గతేడాది తలెత్తిన కొవిడ్‌ సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమైన రాజధాని హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రస్తుత సెకండ్‌ వేవ్‌ వైరస్‌ వ్యాప్తి మరింతగా కుంగదీస్తోంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో వివిధ రంగాలకు చెందిన ఎంస్‌ఎంఈ తయారీ పరిశ్రమలు పలు ఇండస్ట్రియల్‌ ఏరియాల్లో వేలాదిగా విస్తరించి ఉన్నాయి. ప్రస్తుత సెకండ్‌ వేవ్‌లో కరోనా కేసులు కూడా గ్రేటర్‌ హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లల్లోనే రోజురోజుకు ఎక్కువవుతుం డడంతో ఇక్కడున్న ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని పరిశ్రమల యజమానులు తయారీ కార్యకలాపాలను నిలిపివేస్తుం డగా, మరికొన్ని పరిశ్రమల యజమానులు పరిమిత కార్మికులతోనే మూడు షిఫ్టులకు బదులు ఒకటి రెండు షిప్టులతోనే సరిపెడు తున్నారు. దీంతో చాలా మంది కార్మికులు పనిలేక ఇబ్బంది పడుతు న్నారు. పనిచేసిన వారికి కూడా చాలా వరకు యాజమాన్యాలు సగం నెల జీతాలనే చెల్లిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌ నగరం చుట్టుపక్కల ఉన్న ఎంఎస్‌ ఎఈల్లో పనిచేస్తున్న వలస కార్మికుల్లో ఎక్కువ మంది వారి సొంత ఊళ్లకు పయనమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుం టుండగా ఇప్పటికే కొన్ని వేలమంది వారి స్వస్థలాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
మేడ్చల్‌ లోనే 35 వేల దాకా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్లో 3 లక్షల మంది కార్మికులు
మేడ్చల్‌ ప్రాంతంలో బిస్కట్‌ ఫ్యాక్టరీలు, పచ్చళ్లు, చాక్లెట్‌, ఫ్యాబ్రికేషన్‌, స్టీల్‌, ప్లాస్టిక్‌, ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌ లాంటి వివిధ రంగాలకు చెందిన 35 వేల దాకా చిన్న, సూక్ష్మ, మధ్య తరహా తయారీ పరిశ్రమలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటన్నింటిలో కలిపి సుమారు 3 లక్షల మంది దాకా ఉపాధి పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి పరిశ్రమల్లోని చాలా మంది కార్మికులకు ఇటీవల ప్రారంభమైన సెకండ్‌వేవ్‌లో కరోనా సోకి అనారోగ్యం పాలయ్యారని, వీరంతా సిక్‌ లీవ్‌ లేదా పెయిడ్‌ లీవ్‌లలో వెళుతున్నారని అక్కడి ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న పలువురు కార్మికులు చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది కార్మికులు సీరియస్‌ కండీషన్‌లో ఉన్నారని, వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కరోనాతో పరిశ్రమల యాజమాన్యాలు మూసివేయడం లేదా తక్కువ మందితోనే పరిశ్రమ నిర్వహిస్తుండడంతో మేడ్చల్‌లో ఉన్న చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న 60 శాతం మంది దాకా వలస కార్మికులు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని పలువురు వలస కార్మికులు చెబుతున్నారు. ఒక్క మేడ్చల్‌లోనే కాకుండా నాచారం, మల్లాపూర్‌, ఉప్పల్‌, బాలానగర్‌లలో ఉన్న పారిశ్రామక వాడల్లోని పరిశ్రమల్లోనూ తక్కువ మందితో తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని,దీంతో ఇక్కడ కూడా పనులు దొరికే పరిస్థితి లేదని వారు పేర్కొంటున్నారు. ఒక వేళ పని దొరికినా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే డే టైమ్‌లోనే పని ఇస్తున్నారని, కరోనా భయానికి తోడు వేసవిలో ఈ షిప్టులో పనిచేయడం సాధ్యం కాదని వలస కార్మికులు వాపోతున్నారు. సెకండ్‌ వేవ్‌ ఎప్పటికి తగ్గుతుందో తెలియడం లేదని, దీనికి బదులు తమ సొంత ఊళ్లకు వెళ్లి ఏదో ఒక పనిచేసుకోవడం మంచిదని వలస కార్మికులు చెబుతున్నారు.
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కుదరదు: ఫార్మా పరిశ్రమలు
షాపూర్‌నగర్‌, శామీర్‌పేట, మల్లాపూర్‌లలోని పారిశ్రామిక వాడల్లో ఉన్న చిన్న,మధ్య తరహా ఫార్మా పరిశ్రమల్లో ఇప్పటికే చాలావరకు తక్కువ సిబ్బందితో పనిచేస్తున్నాయని పరిశ్రమల యజమాన్యాలు చెబుతున్నాయి. సిబ్బందిలో కొంతమందికి వర్క్‌ ఫ్రమ్‌హోమ్‌ పద్ధతిలో పని చేయించుకుందా మనుకున్న మా పరిశ్రమల్లో తయారీకి ఎక్కువ మంది మ్యాన్‌ పవర్‌ పరిశ్రమలోనే ఉండి పనిచేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. దీంతో కరోనా సెకండ్‌ వేవ్‌లో పని దొరకక కార్మికులు ఓ పక్క ఇబ్బంది పడుతుండగా సరైన సమయానికి సరైన సంఖ్యలో మ్యాన్‌ పవర్‌ దొరకక తాము ఇబ్బందులకు గురువుతన్నామని పలు పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు వాపోతున్నారు.
జీతాలివ్వకపోతే ఫిర్యాదు చేయండి: కార్మిక శాఖ
ప్రస్తుత కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితుల్లో కార్మికులను నిబంధనలు పాటించకుండా ఉద్యోగాల నుంచి తొలగించినా, వారికి ఒప్పుకున్న దాని ప్రకారం జీతాలు చెల్లించకపోయినా యాజమాన్యా లపై కార్మిక చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ అంశాలపై ఫిర్యాదు చేయడానికిగాను కార్మిక శాఖలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశామని, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమకు ఫిర్యాదు చేయాలని వారు కోరుతున్నారు.
నైట్‌ కర్ఫ్యూతో ఇబ్బందులు
24గంటలు, మూడు షిప్టుల్లో తయారీ కార్యకలాపాలు నిర్వహించాల్సిన ఫార్మా వంటి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారని జీడిమెట్ల ప్రాంతంలోని ఒక ఫార్మా పరిశ్రమ మేనేజర్‌ చెబుతున్నారు. ఓ పక్క కరోనా బారిన పడుతున్న కార్మికులు డ్యూటీలకు గైర్హాజరవుతుండగా మరో పక్క నైట్‌ కర్ఫ్యూ ప్రభావంతో డ్యూటీలకు రావడానికి ఎక్కువ మంది కార్మికులు ఇష్టపడడం లేదని మేనేజర్‌ వివరిస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించకపోయిప్పటికీ సెకండ్‌ వేవ్‌ కరోనా ప్యాండమిక్‌లో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News