Monday, April 29, 2024

అనుమతిలేని లే అవుట్లపై హైకోర్టు ఉత్తర్వులు.. పరిమిత రిజిస్ట్రేషన్లకు అనుమతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 2020 ఆగష్టు 26నాటి సర్య్కులర్‌ జీ2/257/2019ను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్రంలోని అందరు సబ్‌ రిజిస్ట్రార్లను ఆదేశిస్తూ తీర్పునిచ్చిన హైకోర్టు ధర్మాసనం మరోసారి తీర్పును సవరిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిట్‌ పిటిషన్‌ 1272లోని ఆర్డర్‌ను మోడిపై చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 18న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. తెలంగాణ మున్సిపల్‌ చట్టం-2019, తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని కీలక నిబంధనలను అమటులు చేసేందుకు తీసుకొచ్చిన అనుమతిలేని ప్లాట్లు, సబ్‌ డివిజన్లు, భవనాలు, నిర్మాణాలను రిజిస్ట్రేషన్లు చేయకుండా నిలుపుదల చేశారు. ఆ తర్వాత అనేక ఇబ్బందులు, ప్రజలనుంచి వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో 2020 డిసెంబర్‌ 29న ఎల్‌ఆర్‌ఎస్‌ లేకపోయినా రిజిస్ట్రేషన్లు చేయవచ్చంటూ పరిమిత మినహాయింపులనిచ్చారు. కాగా ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వేల సంఖ్యలో పిటిషన్లు హైకోర్టులో దాఖలవుతున్న నేపథ్యంలో హైకోర్టు తాజాగా రిజిస్ట్రేషన్లు చేయాలని కామన్‌ తీర్పునిచ్చింది. దీనిపై మరోసారి విచారణ జరిపి సవరణ ఉత్తర్వులు జారీ చేసి ఎవరికి వారుగా న్యాయస్థానంలో ఆర్డర్‌ తెచ్చుకున్నాకే రిజిష్రన్లు మునుపటి విధానంలో జరపాలని ఆదేశించింది.

ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం అనధికారిక లే అవుట్లు, ప్లాట్లు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ, గ్రామ కంఠాల సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇండ్లు కట్టుకున్న వారికి జీవో 58, జీవో 59లను పొడిగింపునిస్తూ తాజాగా సర్కార్‌ అవకాశం కల్పించింది.
కాగా, రాష్ట్రంలో 20వేలకుపైగా లే అవుట్లు ఉండగా, ఇందులో అనుమతి ఉన్నవి కేవలం 3568లే అవుట్లు మాత్రమేనని, 80వేలకుపైగా ఎకరాల్లో వెలిసిన 16వేలకుపైగా లే అవుట్లు అనధికారికంగా ఉన్నాయని ఈ కమిటీకి నివేదిక అందింది. ఇక గతంలో ప్రభుత్వం అనధికారిక లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లకు క్రమబద్దీకరణ చేస్తామని ఇచ్చిన ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా 25,65,562 దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. ఇందులో కార్పొరేషన్లలో 4,16,155, మున్సిపాలిటీలలో 10,66,013, గ్రామాల్లో 10,83,394 దరఖాస్తులు క్రమబద్దీకరణ కోరుతూ ప్రభుత్వానికి చేరాయి.

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై ఇప్పటికే వీటి పరిశీలన, వడపోతకు ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో కేసు ఉండటంతో వీటి పరిశీలన, తదుపరి చర్యలపై సబ్‌ కమిటీ నిర్ణయించే అవకాశాలున్నాయి. కీలకమైన సమస్యగా మారిన గ్రామకంఠం అంశాలో స్పష్టత రానుందని గ్రామీణ ప్రాంతాల ప్రజానీకం ఆశాభావంతో ఉంది. తద్వారా దశల వారీగా ప్రభుత్వ ఖజానాకు క్రమబద్దీకరణ, ఎల్‌ఆర్‌ఎస్‌, గ్రామకంఠం వంటి వాటితో రూ. 10వేల కోట్లకుపైగా రాబడి వచ్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి.

ఈ సబ్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయడంద్వారా భూముల క్రయవిక్రయాల్లో అక్రమాల నివారణకు సర్కార్‌ కీలక సవరణలు చేయనుంది. ఇప్పుడున్న అనధికార లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్దీకరించి, ఆ తర్వాత అనుమతులు లేని లే అవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయకుండా చట్ట సవరణ చేయాలని యోచిస్తోంది. తద్వారా స్థానిక సంస్థలకు పన్నులతోపాటు సర్కార్‌కు ఆదాయం పెరుగుతుందని భావిస్తోంది. రాష్ట్రంలోని మున్సిపాటిలీలు, కార్పొరేషన్లు, నగర పంచాయితీలలో లేఅవుట్లకు అనుమతి లేకపోతే రిజిస్ట్ట్రేషన్‌ చేయవద్దని ఇప్పటికే ఆదేశాలున్నాయి. ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో ఈ దఫా ఎల్‌ఆర్‌ఎస్‌, గ్రామకంఠం సమస్యలను తీర్చి ఆ తర్వాత పురపాలక చట్టంలో సవరణలను ఖచ్చితంగా అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్ట్రేషన్‌పై కీలక నిర్ణయాలు ధరణి రాకతో అమలులో ఉన్నాయి. వీటి అమలుతో సత్ఫలితాలు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ విధానంతో అనేక అక్రమాలకు చెక్‌ పడింది. ఇందుకు రెవెన్యూ రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌(ఆర్‌వోఆర్‌) చట్టంలో చేసిన సవరణలు అద్భుత ఫలాలనిస్తున్నాయి.

ఇకపై అనుమతి లేని లేఅవుట్లపై మరిన్ని కఠిన చర్యలు…
రెరా చట్టం అమలులోకి తెచ్చిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రాష్ట్రంలో పారదర్శక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదేతీరులో పురపాలక, పట్టణ చట్టాల్లో సవరణలు చేసి అనుమతి ఉన్న లేఅవుట్ల వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్లో పొందుపర్చాలని తద్వారా రిజిస్ట్రేషన్‌లకు సులువుకానుందని ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలోని అన్ని పురపాలక, నగర పాలక, నగర పంచాయితీలను రిజిస్ట్రేషన్‌ శాఖతో అనుసంధానించారు. ఆస్తులు, ఇండ్ల మ్యుటేషన్‌ ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానుంచే జరుగుతోంది. రెవెన్యూ శాఖను రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం చేసినట్లుగా పురపాలక శాఖను కూడా అనుసంధానించారు. దీంతో ఆస్తిపన్ను వసూళ్లలో శాస్త్రీయతతోపాటు, ఆస్తిపన్ను పరిధిలోకి రాని నివాసాలను గుర్తించి రాబడి పెంచుకోవచ్చనే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వేకెంట్‌ టాక్స్‌ పేరుతో ఓపెన్‌ ప్లాట్లకు కూడా పన్ను విధిస్తూ ప్రభుత్వం రాబడి పెంచుకుంటోంది. అంతేకాకుండా ఆస్తి పన్ను, ప్రకటనల పన్ను, ట్రేడ్‌ లైసెన్సుల రుసుములను వసూలు చేయడానికి మరింత పారదర్శకత వస్తుందని గుర్తించారు. ఈ విధానం అమలు చేస్తే 30నుంచి 40 శాతం రాబడి పెరుగుతుందని సర్కార్‌ చేసిన సర్వేలో వెల్లడైంది. పురపాలక, నగర పాలక సంస్థలకు ఎంత ఆదాయం ఆర్జిస్తే ప్రభుత్వం అంతే మొత్తం ఇస్తోంది. దీంతో అధిక మొత్తం రాబడి సాధ్యమైతే అభివృద్ధికి నిధుల లోటు రాదని పురపాలక సంఘాలు అంటున్నాయి.

ప్రభుత్వం కూడా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని రాబడికి తీవ్ర ప్రతిబంధకంగా మారిన ఎల్‌ఆర్‌ఎస్‌, అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతోంది. తెలంగాణ మున్సిపల్‌ చట్టం-2019, తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని కీలక నిబంధనలను అమటులు చేసేందుకు తీసుకొచ్చిన అనుమతిలేని ప్లాట్లు, సబ్‌ డివిజన్లు, భవనాలు, నిర్మాణాలను రిజిస్ట్రేషన్లు చేయకుండా నిలుపుదల చేశారు. ఆ తర్వాత అనేక ఇబ్బందులు, ప్రజలనుంచి వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో 2020 డిసెంబర్‌ 29న ఎల్‌ఆర్‌ఎస్‌ లేకపోయినా రిజిస్ట్రేషన్లు చేయవచ్చంటూ పరిమిత మినహాయింపులనిచ్చారు. దీని ప్రకారం కేవలం ఒకసారి రిజిస్ట్రేసన్‌ అయిన డాక్యుమెంట్లను ఎల్‌ఆర్‌ఎస్‌ లేకపోయినా రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతించారు. న్యూ ప్లాట్‌ అనే పదాన్ని నిర్వచించిన అధికారులు అనధికారిక లే అవుట్‌లో ఒక్కసారి కూడా రిజిస్ట్రేసన్‌ కాకుండా మిగిలిపోయిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆదేశించారు. సదరు ప్లాట్లు అధికారిక అనుమతిని సంబంధిత స్థానిక, పట్టణ, కార్పొరేషన్లనుంచి అనుమతి తెచ్చుకున్నాకే రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే భవనాల క్రమబద్దీకరణ జరగని ఇండ్లు, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్లు కూడా నిల్చిపోయాయి. ప్రదానంగా గ్రామాలు, రూరల్‌ జిల్లాల్లో ఈ సర్య్కులర్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నదని రాబడిని, డాక్యుమెంట్ల సంఖ్యను చూసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

గ్రామీణ ప్రాంతాలు, అర్బన్‌,సెమీ అర్భన్‌ ప్రాంతాల్లో ఐటీ, ఔషద, పర్యాటక, స్థిరాస్తి రంగాలు అపూర్వంగా వృద్ధిలో ఉన్నాయి. కొత్త జిల్లాలు, ప్రతిపాదిత ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి వాటి నేపథ్యంలో డిమాండ్‌ భారీగా పెరిగింది. రాష్ట్ర ఖజానాను బలోపేతం చేసుకునే క్రమంలో ఆదాయార్జనకు ప్రతికూలంగా ఉన్న అన్ని నిబంధనలను తొలగించేందుకే సర్కార్‌ మొగ్గు చూపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement