Thursday, May 9, 2024

Follow up : ఎన్‌ఐఎ అదుపులో హైకోర్టు న్యాయవాదులు శిల్ప, దేవేంద్ర..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మూడున్నరేళ్ళ క్రితం నమోదైన మిస్సింగ్‌ కేసుకు సంబంధించిన విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) హైదరాబాద్‌తో పాటు వేర్వేరు ప్రాంతాలలో గురువారం విసృత సోదాలను జరిపింది. ఈ సోదాల అనంతరం హైకోర్టు న్యాయవాదులు చుక్క శిల్ప, దొంగరి దేవేంద్రను అదుపులోకి తీసుకున్న అధికారులు మాదాపూర్‌లోని కార్యాలయంలో విచారిస్తున్నారు. వేర్వేరు బృందాలుగా విడిపోయిన ఎన్‌ఐఎ అధికారులు ఉప్పల్‌ చిలుకానగర్‌లోని హైకోర్టు న్యాయవాది శిల్ప ఇంట్లో సోదాలు జరిపారు. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లు, కొంత విప్లవ సాహిత్యాన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు శిల్పను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఎల్‌బీ నగర్‌, ములుగు, గద్వాల, చర్ల పోలీసుస్టేషన్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ నమోదైన పలు కేసుల్లోనూ శిల్పను అధికారులు విచారిస్తున్నారు. మరికొన్ని ఎన్‌ఐఎ బృందాలు మేడిపల్లి, పర్వతాపూర్‌లతో పాటు మెదక్‌ జిల్లా చేగుంటలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల అనంతరం హైకోర్టు న్యాయవాది దేవేంద్రను కూడా అదుపులోకి తీసుకుని మాదాపూర్‌లోని కార్యాలయానికి తరలించారు. గతంలో ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ప్రభాకర్‌ భార్యే దేవేంద్ర. గతంలో శిల్ప, దేవేంద్రలు చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) లో కీలకంగా పని చేశారు. మెదక్‌ జిల్లా చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడి నివాసంలోనూ ఎన్‌ఐఎ సోదాలు జరిపింది. ఎన్‌ఐఎ సోదాలన్నీ గురువారం తెల్లవారు జాము నుంచే మొదలయ్యాయి.

సోదాలకు కారణం…

తన కూతురు కిడ్నాప్‌నకు గురైందని డిసెంబర్‌ 2017లో ఏపీలోని విశాఖపట్టణంలోని పెద్దబాయిల పోలీసుస్టేషన్‌లో హైదరాబాద్‌ కాప్రాలోని సాయిబాబానగర్‌లో నివసించే రాధ తల్లి పల్లెపాటి పోచమ్మ ఫిర్యాదు చేసింది. మావోయిస్టు అనుబంధ సంస్థ సీఎంఎస్‌ నాయకులు కిడ్నాప్‌ చేసి రాధను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించింది. నర్సింగ్‌ కోర్సు చేస్తున్న తన కూతురితో శిల్ప, స్వప్న, దేవేంద్రలు తరచూ తమ ఇంటికి వచ్చే వారని, విప్లవంపై ఆమెకు నూరిపోసి ఏవోబీలోని మావోయిస్టు అగ్రనేతలు ఉదయ్‌, అరుణల వద్ద మావోయిస్టు ఉద్యమంలో చేర్పించారని పోచమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇంటికి తరచూ సీఎంఎస్‌ నేతలు దేవేంద్ర, స్వప్న, శిల్ప వచ్చే వారని వెల్లడించింది. వైద్యం పేరుతో దేవేంద్ర తన కూతురిని తీసుకు వెళ్ళారని రాధ తల్లి ఫిర్యాదు చేసింది. రాధ అదృశ్యంపై డిసెంబర్‌ 2017లో విశాఖపట్టణంలో మిస్సింగ్‌ కేసు నమోదవగా, రాధను మావోయిస్టులలో చేర్చారంటూ న్యాయవాది శిల్పపై ఆరోపణలు వచ్చాయి. కిడ్నాప్‌ ఫిర్యాదుపై ఈ ఏడాది జనవరిలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పెద్దబాయలు పోలీసులు సీఎంఎస్‌ సభ్యులు కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్ళను సందర్శించి పేద మహిళలకు సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తున్నారని, వారికి ఉపాధి కల్పిస్తామని మావోయిస్టు పార్టీలో చేరేలా ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మే 31వ తేదీన ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించి దర్యాప్తు జరపాలని ఆదేశించింది. దీంతో జూన్‌ 3 వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఎన్‌ఐఎ విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తులో భాగంగానే దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement