Tuesday, May 21, 2024

పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌! 2558 మంది ఉద్యోగులకు ప్రయోజనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపుల తర్వాత బదిలీల కోసం వివిధ శాఖలపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ప్రధానంగా ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. వివిధ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగుల పరస్పర బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఉపాధ్యాయ పరస్పర బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరస్పర బదిలీలపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 2558 ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి సబిత పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులకు సంబంధించి పరస్పర బదిలీ దరఖాస్తుల్లో 1260 మంది వరకు మాత్రమే అంగీకార పత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది. 2558 మందిలో ఉపాధ్యాయులు 1260 మంది ఉండగా, మిగిలినవారు ఇతర శాఖ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు చెప్తున్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం గతేడాది 317 జీవోను అమలు చేసింది. ఈనేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ కొంత మందిని కొత్త జిల్లాలకు పంపింది.అయితే పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఒత్తిడి చేశాయి. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో 2598 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరస్పర బదిలీలు కోరుకునేవారి పాత సర్వీసును కొనసాగించబోమని, కొత్తగా చేరినప్పటి నుంచే సర్వీసు వర్తింపజేస్తామని మార్గదర్శకాలను అప్పట్లో వెలువరించింది. బదిలీలు కోరుకునే వారి నుంచి అండర్‌ టేకింగ్‌(అంగీకార పత్రాలు) కూడా తీసుకున్నారు. అయితే కొందరు పరస్పర బదిలీలపై కోర్టును ఆశ్రయించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో కోర్టు ఏ తీర్పు వెలువరించినా దానికి కట్టుబడి ఉండాలని ఉపాధ్యాయుల నుంచి అంగీకార పత్రం తీసుకున్నారు. అంగీకార పత్రం ఇచ్చేందుకు దాదాపు 1260 మంది టీచర్లు మాత్రమే ముందుకు వచ్చారు. ఇచ్చిన వారికే బదిలీ చేసేస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఈక్రమంలోనే పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్న అప్పీళ్లకు ప్రభుత్వం ఆమోదించింది.

మరీ సాధారణ బదిలీలెప్పుడు?

సాధారణ బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవుల్లో షెడ్యూల్‌ను ప్రకటించి ఈనెలాఖరులో ప్రక్రియను పూర్తి చేస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ వేసవి సెలవులు ముగిసి విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంకా పదోన్నతులు, బదిలీల ప్రక్రియపై స్పష్టత రాలేదు. ఉపాధ్యాయులకు చివరిసారిగా 2015లో పదోన్నతులు కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఈనెలాఖరులోగా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను ప్రకటించకుంటే జులై 7న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు సోమవారం ధర్నా నోటీసలు అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

- Advertisement -


Advertisement

తాజా వార్తలు

Advertisement