Thursday, May 2, 2024

త్వరలో టీచర్లకు శుభవార్త.. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రమోషన్లు, బదిలీలకు కసరత్తు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: త్వరలోనే ఉపాధ్యాయులు మంచి శుభవార్త వినబోతారని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రమోషన్లు, బదిలీ ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకే కాస్త ఆలస్యం జరగుతోందని ఆమె పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని ఆమె అన్నారు. కరోనా సమయంలో టీచర్లు చేసిన కృషిని సమాజం ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సోమవారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు మంత్రులు సబిత, శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, రఘోత్తం రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేసి ఉచిత విద్య అందిస్తున్నామన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆమె విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా కుట్రలు చేస్తోందని ఆగ్రహించారు. విద్యార్థులకు విద్యతోపాటు నైతిక విలువలను కూడా నేర్పాలని టీచర్లకు సూచించారు. ఉన్నత విద్యలో సమూల మార్పులు తెస్తామని, డిమాండ్‌ ఉన్న కోర్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి అందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement