Tuesday, April 30, 2024

బంగారాన్ని కొట్టేసిన 108 సిబ్బంది…

బంగారం చోరీ కేసును చేధించిన పోలీసులు

  • 2.3 కిలోల బంగారం స్వాధీనం
  • 108 సిబ్బందే నిందితులు
  • రామగుండం సీపీ సత్యనారాయణ

గోదావరిఖని: రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుల వద్ద నుంచి చోరీకి గురైన బంగారం కేసులో మిస్టరీని రామగుండం పోలీసులు 12 గంటల్లో తేల్చారు. బుధవారం రామగుండం కమిషనరేట్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం తెల్లవారు జామున గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వ్యాపారులు ప్రయాణిస్తున్న కారు మల్యాలపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిందని, ఈ ప్రమాదంలో బంగారం వ్యాపారి కొత్త శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందగా, కొత్త రాంబాబు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారన్నారు. మృతుడు శ్రీనివాసరావు వద్ద రామగుండం పోలీసులు 2కిలోల 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోగా, కారులో ప్రయాణిస్తున్న గంట సంతోష్‌ను ఆంబులెన్స్‌లో తరలించిన ఈఎంటీ చాంద్‌, డ్రైవర్‌ రాజేందర్‌లు క్షతగాత్రుడి వద్ద దొరికిన కిలో బంగారాన్ని రామగుండం ఎస్‌ఐ శైలజకు అప్పగించారన్నారు. మొత్తం పోలీసులకు 3 కిలోల 300 గ్రాముల బంగారం దొరికినట్లు సీఐ కరుణాకర్‌రావు మీడియాకు తెలియజేశారన్నారు. మృతుని బంధువులు కారులో 5కిలోల 600 గ్రాముల బంగారం ఉండాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైందని ఫిర్యాదు మేరకు రామగుండం పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడిన కొత్త రాంబాబును ఆస్పత్రికి తరలించిన 108 డ్రైవర్‌ గుజ్జుల లక్ష్మారెడ్డి, ఈఎంటీ తాజుద్దీన్‌లను విచారించారన్నారు. విచారణలో భాగంగా ఆస్పత్రికి తరలిస్తుండగా చికిత్స చేసే క్రమంలో రాంబాబు జేబులో ఉన్న 2 ప్లాస్టిక్‌ కవర్లలో ఉన్న బంగారాన్ని చూసిన ఈఎంటీ తాజుద్దీన్‌ దురాశతో డ్రైవర్‌ లక్ష్మారెడ్డికి తెలియజేయగా, దొరికిన సొత్తుతో దర్జా జీవితం అనుభవించొచ్చని బంగారం కాజేసి మృతదేహాన్ని ఆస్పత్రిలో వదిలి ఇంటికి వెళ్లిపోయినట్లు అంగీకరించారన్నారు. ఇద్దరి వద్ద నుంచి 2 కిలోల 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. బంగారం చోరీ కేసును 12 గంటల్లోనే చేధించిన రామగుండం సీఐ కరుణాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌, ఎస్‌ఐ శైలజ, సిబ్బందిని సీపీ అభినందించారు. మీడియా సమావేశంలో డీసీపీ రవీందర్‌, అడిషనల్‌ డీసీపీ కమాండెంట్‌ సంజీవ్‌, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌, ఇన్స్‌పెక్టర్లు కరుణాకర్‌రావు, రాజ్‌కుమార్‌, ఎస్‌ఐ శైలజతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement