Sunday, April 28, 2024

ADB: మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దుచేయాలి.. ఆటో డ్రైవర్ల రాస్తారోకో..

కడెం, డిసెంబర్ 12, (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన కడెంలోని జాతీయ రహదారిపై ఇవాళ కడెం దస్తురాబాద్ మండలలోని ఆటో మ్యూజిక్ డ్రైవర్లు, యజమానులు రాస్తారోకో చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తమ ఆటోలు నడవలేక తమ జీవనోపాధికి నష్టం కలుగుతుందన్నారు. ప్రతిరోజూ అధిక సంఖ్యలో మహిళలు ఆటోల్లో, టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణించేవారని, దీంతో తాము ఉపాధి పొంది కుటుంబాన్ని పోషించే వాళ్లమని వారు పేర్కొన్నారు.

ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమకు తమ కుటుంబాలకు తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ నినాదాలు చేశారు. అనంతరం కడెం మండల తహసిల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ ను కలిసి ఆటో డ్రైవర్లు తమ గోడు వినిపించారు. ఇకనైనా ప్రభుత్వం పునరాలోచించి మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకమును రద్దు చేయాలని, తమ సమస్యను అర్థం చేసుకొని తమకు న్యాయం చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement