Tuesday, April 30, 2024

Exclusive: పైరవీలకు, పైసలకు… ఉత్తమ ఉద్యోగి అవార్డు

నిజామాబాద్ సిటీ, ఆగస్ట్ (ప్రభ న్యూస్) 17 : ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఇచ్చే ప్రశంసా పత్రాల పంపిణీలో పైరవీలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఒకసారి అనుకోకుండా జరిగింది… అంటే సరిపెట్టు కోవచ్చు. ఈ పైరవీల అవార్డులు ప్రతి జెండా వందనంకు అంటుకుంటుంది. విధి నిర్వహణలో మొహం చాటేస్తూ పైరవీలు చేస్తున్న వారే మళ్ళీ మళ్ళీ అవార్డులు తీసుకోవడం ఆయా శాఖల్లో జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఒక శాఖ నుంచి ఒకరికో ఇద్దరికో అవార్డు ఇస్తే దానికి విలువ ఉంటుంది… ప్రతి జెండా వందనానికి శాఖ నుంచి చాలా మందికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం చూస్తే ఉద్యోగులతో పాటు ఆసీనులైన ఆహుతులు సైతం ఇదే మీ భాగోతం రా బాబు అని విసుక్కుంటున్నారు…


మొన్న పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఇలాంటి భాగోతమే ఒకటి వెలుగులోకి వచ్చింది. జిల్లా అధికారికి తెలియకుండానే కిందిస్థాయి ఉద్యోగి పేరు అవార్డుల లిస్టులో ఉండడం అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. విద్యుత్ శాఖలో బాల్కొండ మండల కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ పేరు ఉండడమే ప్రధాన కారణం. ఇతని పేరును డీఈ కానీ, ఎస్ఈ కానీ జిల్లా కలెక్టర్ కు పంపలేదు. జెండా వందనం అనంతరం ప్రశంసా పత్రాల పంపిణీ సమయంలో కలెక్టరేట్ వాళ్లు ఇచ్చిన జాబితాలో బాల్కొండ ఉద్యోగి పేరును చూసి అందరూ నోరెళ్ళబెట్టారు.


ఎస్ఈ కి తెలియకుండానే…!
కలెక్టరేట్ నుండి వచ్చిన జాబితాలో బాల్కొండ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ పేరును… చూసి ఎస్ఈ నిర్గాంత పోయారు. తాను జిల్లా అధికారినేనా… నాకు తెలియకుండా ఈ అవార్డుకు ఎవరు ఎంపిక చేశారు…? అలాంటప్పుడు సిబ్బంది పేర్లు పంపండని కలెక్టరేట్ నుంచి నాకెందుకు ఆదేశాలు జారీ చేసినట్టు…? అని ఆలోచిస్తూ ముభావంగా ఎస్ఈ కూర్చుండిపోయారు. ఇదంతా గమనిస్తున్న ఉద్యోగులు తమలో తామే నవ్వుకోవడం గమనార్హం. ఎస్ఈ కి అవార్డు వచ్చిన ఆ ఆనందాన్ని పొందలేకపోయారు. కిందిస్థాయి ఉద్యోగి చేసిన పనితీరుకు ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మిన్న కుండిపోయారు.

- Advertisement -

మండిపడుతున్న శాఖ ఉద్యోగులు ….
విద్యుత్ శాఖ అధికారుల ప్రమేయం లేకుండా అవార్డు రావడంపై ఉద్యోగులందరూ మండిపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే శాఖలో అధికారులు ఉన్నారా.. లేరా అనే సందిగ్ధం నెలకొంటుంది. తమకు అధికారులు, నాయకులు తెలుసు. అవార్డులు పొందుతాం అని ఉద్యోగులు ఖరాకండిగా మాట్లాడుకోవడం వినిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement