Monday, April 29, 2024

KNR: మత సామరస్యంతో పండుగలు జరుపుకోవాలి… సిపి సుబ్బరాయుడు

మత సామరస్యం, సహోదర భావంతో పండుగలు జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బ రాయుడు అన్నారు. బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్ నందు పీస్ కమిటీ సభ్యులతో ఈనెలలో రానున్న ప్రముఖ పండుగలైన గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబిల దృష్యా నగరంలోని అన్నివర్గాల మత పెద్దలతో శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో, శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకుంటూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నచోటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలు గుర్తించాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఏదేని చిన్న చిన్న సంఘటనలు జరిగితే వాటిని రాజకీయాలకు ముడిపెట్టొద్దన్నారు.

ఏ వర్గం వారికైనా ఇతరుల వలన ఇబ్బందికర సమస్యలు తలెత్తితే, పరిష్కారానికై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలే తప్ప స్వతహాగా వ్యవహరించకూడదన్నారు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, సత్య దూరం అయిన విషయాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతినేవిధంగా అభ్యంతరకర పోస్టులు పెట్టె అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఆ పోస్టులను చూసిన వెంటనే ప్రతిస్పందించకుండా, సంయమనం పాటిస్తూ ఆ పోస్టుల్లో నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని, అందుబాటులో వున్న సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ఒకవేళ ఉల్లంఘించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఈ సారి కూడా శాంతియుతంగా పండుగలు జరిగేలా అన్నివర్గాల ప్రజలు, మత పెద్దలు సహకరించాలని కోరారు.


ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారులకు తప్పకుండా తెలియజేయాలన్నారు. అందువలన మండపం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే అవకాశం ఉంటుందని, అనుమతుల కనుగుణంగా పోలీస్ గస్తీ నిర్వహిస్తామని తెలిపారు. గణేష్ మండపాల వద్ద బాధ్యత కలిగిన నిర్వహణ కమిటీ సభ్యులు, సీసీ కెమెరా ఏర్పాటు, షాట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ వైర్ల పట్ల జాగ్రత్త వహించాలని, నిర్వహణ సభ్యులు పోలీసులకు సహకరిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో డిసిపి లక్ష్మి నారాయణ, రాజు, ఎసిపి లు శ్రీనివాస్, నరేందర్, కరుణాకర్, జీవన్ రెడ్డి, సర్వర్, ప్రతాప్, ఇన్స్పెక్టర్ లు వెంకటేష్, రవి కుమార్, రాంచందర్ రావు, ఇంద్రసేనారెడ్డి, ప్రదీప్, సురేష్ లతో పాటు విశ్వహిందూ పరిషత్ కి చెందిన విభాగ్ గో రక్ష ప్రముఖ్ వి రాధాకృష్ణ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు టి నవనీత రావు, జిల్లా కార్యదర్శి ఏ విద్యాసాగర్, అబ్దుల్ గఫార్, ముజఫర్, జియాఉల్లాఖాన్, తిజో మూర్తిలతో పాటు ఇతర మతపెద్దలు, శాంతి సంక్షేమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement